World Elephant Day : నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం... ప్రత్యేకమేమిటంటే..!
నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం... ప్రత్యేకమేమిటంటే..!
అందరికీ ఉన్నట్టుగానే ఏనుగులకు(Elephants) కూడా ఓ రోజుంది. ఆ రోజు వాటికి చాలా ప్రత్యేకం. ఊహ తెలిసిన మనిషి మచ్చిక చేసుకున్న జంతువులలో ఏనుగు కూడా ఒకటి. మానవులతో చెలిమి చేసుకునే పెద్ద జంతువు. రాజుల కాలంలో రాజ్య రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న చతురంగ బలాలలో గజబలం చాలా కీలకమైనది. భావోద్వేగాలను అనుభూతి చెందడంలోను, వాటిని ప్రకటించడంలోను ఏనుగుల ప్రవర్తన ఇంచుమించు మనుషులను పోలి ఉంటుంది. సాటి ఏనుగుల పట్లనే కాదు, తమను మాలిమి చేసుకునే మనుషుల పట్ల కూడా ఏనుగులు భావోద్వేగాలను వ్యక్తం చేస్తాయి. ఏనుగు ఎప్పుడు ఒంటరిగా ఉండదు. ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. తమకు నేస్తాలుగా ఉన్న ఏనుగులను చూసినప్పుడు సంతోషంగా చెవులు విప్పార్చడం, తోక ఊపడం, శరీరాన్ని కదిలించడం వంటి చర్యల ద్వారా పలకరిస్తాయి. చాలాకాలం తర్వాత కనిపించినట్లయితే, పట్టరాని సంతోషంతో ఘీంకారనాదం చేస్తాయి. నేస్తాలైన ఏనుగులు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఒకదానికొకటి తొండాలను పెనవేసుకుని తమ ఆత్మీయతను వ్యక్తం చేస్తాయి. వేర్వేరు దారుల్లో వెళుతున్న మగ ఏనుగులు తమ దోస్తులను పలకరించుకుంటాయి. మనం షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నట్టుగానే అవి కూడా శరీరాన్ని తాకించుకుని పలకరించుకుంటాయి.ఏనుగులు ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటాయి. ఆకలి వేసినప్పుడు గున్న ఏనుగులు కొన్ని సంజ్క్షలతో తల్లులకు ఆ సంగతి చెబుతాయి. తల్లులకు తమ పిల్లల చేష్టలు ఇట్టే అర్థమవుతాయి. అల్లరిని వారించినప్పుడు చిన్నపిల్లల్లాగే అలుగుతాయి. పిల్ల ఏనుగులు అలిగినప్పుడు ఎక్కడివక్కడే ఆగిపోతాయి. తల్లులతో వెళ్లకుండా మారం చేస్తాయి. వాటిని బుజ్జగిస్తే తప్ప అలక మానవు. ఈడొచ్చిన మగ ఏనుగులు తాము జతకట్టదలచుకున్న ఆడ ఏనుగులను ఆకర్షించడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తాయి. వాటితో సల్లాపాలడతాయి. ఏనుగులు జత కట్టిన తర్వాత కుటుంబాన్ని ఏర్పరచుకుంటాయి.