SIPRI Report 2024 : అణ్వాయుధాల కోసం భారత్, పాక్ పోటాపోటీ!
యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. కానీ అవతలి దేశాలు తెగబడి దూసుకువస్తే కత్తులు దూయాల్సిన ఆవశ్యకత ఉంటుంది.
యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. కానీ అవతలి దేశాలు తెగబడి దూసుకువస్తే కత్తులు దూయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందుకే ప్రత్యర్థుల కంటే ఆయుధ(Weapon) సంపత్తి ఎక్కువ ఉండేట్టు చూసుకుంటాయి! అత్యాధునిక ఆయుధాల కోసం ప్రయత్నిస్తాయి. వీలైతే అణ్వాయుధాలను కూడా సిద్ధం చేసుకుంటాయి. ఇలాగే మన దేశంతో పాటు చైనా(China), పాకిస్తాన్(Pakistan) దేశాలు అణ్వాయుధాలను పెంచుకోవడంలో పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉంటే, మన దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే 2024 జనవరి నాటికి చైనా అణు వార్‌హెడ్స్ 410 నుంచి 500కు పెరిగాయి. ఈ వివరాలను స్వీడన్‌కు(Swedan) చెందిన మేథో సంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) అందించింది. అణ్వాయుధ సేకరణలో ఇండియాను నిరోధించటమే లక్ష్యంగా పాకిస్తాన్ ముందుకు వెళుతున్నదని సిప్రి తెలిపింది. అయితే సుదీర్ఘ లక్ష్యాల్ని తాకే అణువార్ హెడ్లపై భారత్ దృష్టిపెట్టిందని, ముఖ్యంగా చైనా అంతటా లక్ష్యాల్ని చేరుకోగలగటం ప్రాధాన్యతగా ఉందని సిప్రి తన నివేదికలో పేర్కొంది. భారత్, పాక్, చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దేశాల అణు వార్‌హెడ్లకు సంబంధించి కీలక విషయాలను ఆ నివేదికలో వివరించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,100 అణ్వాయుధాలు ఉన్నాయట! ఇందులో 90 శాతం అమెరికా, రష్యా దేశాలే కలిగి ఉన్నాయని సిప్రి చెబుతోంది.