Syria Revolution: అసద్ పాలన అంతానికి నాందిపలికింది ఓ పిల్లోడు!
సిరియాలో అర్ధ శతాబ్దం పాటు సాగిన అసద్ కుటుంబపాలన అంతమయ్యింది. దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది.
సిరియాలో అర్ధ శతాబ్దం పాటు సాగిన అసద్ కుటుంబపాలన అంతమయ్యింది. దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయారు. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. అసద్ ప్రయాణిస్తున్న విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సిరియాలో కొత్త శకం ప్రారంభమయ్యింది. 13 ఏళ్ల కిందట అంకురించిన తిరుగుబాటు ఉద్యమం మహావృక్షంగా మారి అసలు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసింద. ఈ విప్లవ జ్వాలను రగిలించింది ఓ 14 ఏళ్ల కుర్రాడంటే నమ్మలేం కానీ ఇది నిజం. సుమారు 13 ఏళ్ల కిందట ఆ బాలుడు అనుకోకుండా రగిల్చిన విప్లవాగ్ని భయంకరమైన అగ్ని కీలల్లా ఎగసిపడింది. నియంతృత్వ పాలనను దగ్ధం చేసింది. వీటన్నింటికీ మూలం ట్యునీషియాలో మొదలైన జాస్మిన్ విప్లవం. 2010-2011లో ట్యునిషియాలో ఓ చిన్న వ్యాపారి మహమ్మద్ బువాజీజీతో ఓ అధికారి దురుసగా ప్రవర్తించాడు. టమాట ధరపై అధికారికి..దుకాణ యజమానికి మధ్య జరిగిన చిన్న గొడవ దేశ పాలకుడిపై కత్తి దూసేంత వరకు వెళ్లింది. ఆ వ్యాపారి ఆత్మహత్య చేసుకోవడంతో ప్రజలు ఆందోళన బాట పట్టారు. దెబ్బకు దేశ పాలకుడు గద్దె దిగాడు.ట్యునీషియాలో వచ్చిన జాస్మిన్ విప్లవ పరిమళాలు అవినీతి అక్రమాలు విలయతాండవం చేస్తున్న అరబ్ దేశాలన్నింటికీ పాకింది. టునేషియా, ఈజిప్టులలో చెలరేగిన ఉద్యమాలు యెమన్, అల్జీరియా, జోర్డాన్, సూడాన్‌లలోని ప్రజలు స్ఫూర్తిగా తీసుకున్నారు.కుటుంబ పాలనలో నలిగిపోతున్న సిరియా దేశ ప్రజలకు ఈ విప్లవం ఓ ఆశాజ్యోతిలా కనిపించింది. దారా ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల మువావియా సియాస్నే.. అరబ్ దేశాలలో ఏం జరుగుతున్నదో టీవీల్లో చూశాడు. తన స్నేహితులను పోగు చేశాడు. 2011, ఫిబ్రవరి 26న స్కూల్ ఆ గోడ మీద కొన్ని రంగులు తీసుకుని ఎజాక్ ఎల్ దూర్ య డాక్టర్ (నీ వంతు వచ్చింది డాక్టర్ ) అని రాశాడు. తను రాసిన రాతలు దేశాన్ని మార్చేస్తాయని అప్పుడా బాలుడు అనుకోలేదు. సాయంత్రం ఇంటికొచ్చిన మువావియా సియాస్నే తన తండ్రికి విషయం చెప్పాడు. కుటుంబం మొత్తం భయంతో వణికిపోయింది. ఎక్కడైనా దాక్కోమని కుమారుడికి సలహా ఇచ్చాడు ఆ తండ్రి. ఆ సలహాను పెద్దగా పట్టించుకోకుండా చక్కగా నిద్రపోయాడు. తెల్లవారుజాము నాలుగు గంటల ప్రాంతంలో పోలీసులు వచ్చి సియాస్నేను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. గోడ మీద రాతలు రాసే సమయంలో మరో ముగ్గురు స్నేహితులు వెంట ఉండడంతో వారిని కూడా జైల్లో తోశారు.
పాడై పోయిన భోజనం పెడుతూ, ఒంటి మీద నూలుపోగు లేకుండా కర్రలతో బాదుతూ.. కరెంట్ షాక్ ఇస్తూ చిత్రహింసలు పెట్టారు. దాదాపు 45 రోజుల పాటు ఆ పిల్లలకు నరకం చూపించారు. తమ పిల్లల కోసం తండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళితే వారు చాలా నీచంగా మాట్లాడారు. ' ఈ పిల్లలను మరిచిపోండి. ఇళ్లకు వెళ్లి మీ పెళ్లాలతో మళ్లీ పిల్లల్ని కనండి. మీకు చేతకాకపోతే మీ ఆడాళ్లను మా దగ్గరకు పంపండి’ అంటూ అత్యంత నీచంగా మాట్లాడారు. బాధను తిగమింగుకుంటూ తండ్రులు ఇళ్లకు చేరారు. ఈ విషయం దేశం అంతటా తెలిసిపోయింది. ఆ నలుగురు పిల్లల విముక్తి కోసం వేల మంది రోడ్డెక్కారు. వాళ్లను విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ ఉద్యమించారు. ఈ ఉద్యమం దావానంలా వ్యాపించింది. 2011, మార్చి 15వ తేదీన సిరియా వ్యాప్తంగా ప్రజా నిరసన కార్యక్రమాలు(Day of Rage) జరిగాయి. ఆ దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను అదుపు చేయడానికి సిరియా పాలకులు మళ్లీ హింసనే నమ్ముకున్నారు. ఫలితంగా ఆందోళనలను హింసాత్మకంగా మారాయి. కొన్ని రోజులకు సైన్యంలో కూడా చీలికలు వచ్చాయి. 45 రోజుల తర్వాత క్షమాభిక్ష పేరిట ఆ నలుగురు పిల్లలను విడిచిపెట్టారు. మరోసారి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల వైపు చూడకూడదని లిఖితపూర్వకంగా రాయించుకున్నారు. అయితే.. మువావియా జీవితం అప్పటి నుంచి తారుమారు అయ్యింది. నాలుగేళ్ల తర్వాత అంతర్యుద్ధంలో తండ్రి చనిపోయాడు. ఆ తర్వాతి రోజుల్లో సిరియా విముక్తి పేరిట ఏర్పాటైన సైన్యంలో చేరాడు సియాస్నే. ఇన్నేళ్ల అంతర్యుద్ధాన్ని, అందులో పోయిన లక్షలాది ప్రాణాలను తల్చుకుంటూ దుఃఖిస్తాడు తాను అలాంటి పని చేయకుండా ఉండాల్సిందని కాదని అనుకుంటుంటాడు.