భారతదేశాన్ని, ప్రధాని మోదీని కించపరిచేలా పోస్ట్ చేసి వివాదానికి కారణమైన మాల్దీవుల మంత్రి

భారతదేశాన్ని, ప్రధాని మోదీని కించపరిచేలా పోస్ట్ చేసి వివాదానికి కారణమైన మాల్దీవుల మంత్రి మరియం షియునా.. మరోసారి వార్తల్లో నిలిచింది. భారత జాతీయ జెండాను అగౌరవపరిచే విధంగా మరియం షియునా సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో షియునా క్షమాపణలు చెప్పింది. వెంటనే ఆ పోస్ట్‌ను కూడా డిలీట్ చేసేసింది. భారత త్రివర్ణ పతాకంపై అశోక చక్రం స్థానంలో ప్రతిపక్ష పార్టీ ప్రచారానికి సంబంధించిన పోస్టర్‌ను ఉంచింది మరియం షియునా. మాల్దీవుల్లో అధికారంలో ఉన్న పార్టీలో సభ్యురాలైన మరియం షియునా ఆ ఫోటోను పోస్ట్ చేసి పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చింది. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత వ్యతిరేక విధానాలనే అనుసరిస్తున్నారు. మాల్దీవుల్లో మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు భారత త్రివర్ణ పతాకంపై అశోక చక్రం స్థానంలో ప్రతిపక్ష పార్టీ ప్రచారానికి సంబంధించిన పోస్టర్‌ను ఉంచి మరియం షియునా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తీవ్ర విమర్శలు రావడంతో ఆ పోస్టును డిలీట్ చేసింది. తాను ఇటీవల చేసిన సోషల్ మీడియా పోస్టు విమర్శలకు దారి తీసిందని తెలిపింది మరియం షియునా. ఈ పోస్టు వల్ల ఏదైనా గందరగోళం లేదా నేరం జరిగి ఉంటే నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని మరియం షియునా చెప్పుకొచ్చింది. మాల్దీవుల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఎండీపీకి కౌంటర్‌గా తాను ఆ ఫోటో షేర్ చేసినట్లు షియునా వివరణ ఇచ్చింది.

Updated On 8 April 2024 8:51 PM GMT
Yagnik

Yagnik

Next Story