Sunita Williams : 9 నెలల తర్వాత సేఫ్గా భూమి మీదకు సునీత...!
9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్

9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’సురక్షితంగా వారిద్దరినీ భూమి మీదకు తీసుకొచ్చింది. సునీత, విల్మోర్‌లతోపాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్‌ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో భూమికి చేరుకున్నారు.
సాగర జలాలకు 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని రెండు డ్రోగ్‌చూట్లు తెరుచుకున్నాయి. అప్పుడు వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు. డ్రోగ్‌చూట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూడ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే.. సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. డ్రోగ్‌చూట్లు, పారాచూట్లు క్రూ డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్లెం వేయడంతో కమాండ్ సెంటర్‌లో చప్పట్లు మార్మోగాయి. ఆపై ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్‌బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక.. వ్యోమనౌకను మేగన్ నౌకపైకి చేర్చారు. ఆపై- లోపల ఉన్న నలుగురు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్ నిక్ హేగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీతా విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు. క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత.. ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు.
