Ants Perform surgery : చీమలు మనలాగే సర్జరీలు చేస్తాయట! తోటి చీమలను రక్షించుకుంటాయట!
Ants Perform surgery : చీమలు మనలాగే సర్జరీలు చేస్తాయట! తోటి చీమలను రక్షించుకుంటాయట!
మనకే అన్ని తెలుసని విర్రవీగుతుంటాం కానీ, మనకంటే పిపీలికం అంటూ చిన్నచూపు చూసే చీమలు కూడా మనకంటే తెలివైనవే! కష్టపడటం ఎలాగో చీమలను(Ants) చూసి నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. మనం ఎంతో కష్టపడి చదువుకుని సర్జరీలు(surgeries) చేస్తాం కానీ చీమలు తమ తెలివితేటలతోనే డాక్టర్లుగా, సర్జన్లుగా పన చేస్తాయి. గాయపడిన చీమను(Injured ants) రక్షించడానికి తోటి చీమలు డాక్టర్లుగా మారి వైద్య చికిత్స(Treatment) చేస్తాయి. ఈ విషయం జర్మనీలోని(germany) యూనివర్సిటీ ఆఫ్ వుర్జ్‌బర్గ్ సైంటిస్టులు చేసిన పరిశోధనలో తేలిందట! మందులు, వైద్య పరికరాల అవసరం లేకుండానే శస్త్రచికిత్సలను చేస్తాయట! ఏదైనా చీమ గాయపడితే తోటి చీమలు వెంటనే ఆ గాయపడిన చీమ చుట్టూ చేరతాయి. దాన్ని పుట్టలోకి తీసుకెళతాయన్న విషయం ఇది వరకు జరిగిన పరిశోధనలతో తేలింది. అయితే పుట్టలోకి తీసుకెళిన తర్వాత ఆ చీమలు ఏం చేస్తాయన్నది ఇంతకాలం అంతుపట్టకుండా ఉండింది. ఈ విషయంపై మైక్రో కెమెరాల సాయంతో వుర్జ్‌బర్గ్ యూనివర్సిటీ సైంటిస్టులు పరిశోధనలు చేశారు. ఇందుకోసం ఓ ఫ్లోరిడా కార్పెంటర్ చీమ కుడి తొడ కిందిభాగంలో ఉద్దేశపూర్వకంగా కోత పెట్టారు. ఇది జరిగిన వెంటనే ఆ గాయపడిన చీమ చుట్టూ పదుల సంఖ్యలో చీమలు చేరుకున్నాయి. గాయపడిన చీమను దగ్గరలో ఉన్న పుట్టలోకి తీసుకెళ్లాయి. రక్తస్రావం కాకుండా తమ నోటిలోని లాలాజలంతో ఆ గాయాన్ని అదే పనిగా తడిపాయి. తర్వాత గాయం ఇన్ఫెక్షన్ కాకుండా ఉండేందుకు తొడ కింద భాగాన్ని శరీరం నుంచి వేరు చేశాయి. ఇందుకోసం గాయపడిన చీమ తొడను తోటి చీమలు అదే పనిగా కొరికాయి. చీమ శరీరం నుంచి ఆ భాగం వేరుపడగానే మళ్లీ లాలాజలంతో రక్తస్రావాన్ని అడ్డుకున్నాయి. ఇదంతా కేవలం 40 నిమిషాల్లోనే పూర్తయ్యింది. కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలు పరిశోధకులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొద్ది సేపటికి గాయపడిన చీమ మామూలు స్థితికి వచ్చేసింది. ఆ చీమను తోటి చీమలు ప్రాణాలతో కాపాడగలిగారు. ఈ వివరాలన్నీ కరెంట్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భూమ్మీద ఉన్న సమస్త జీవరాశులలో మనిషి తర్వాత సర్జరీ చేసే రెండో జీవి చీమనేనట!