Stefan Mandel : లాటరీ దక్కాలంటే లక్కుంటే చాలదు, బుర్ర కూడా ఉండాలి!
లక్కుంటే కానీ లాటరీ(Lottery ) తగలవనే అభిప్రాయం తప్పని ప్రూవ్ చేశాడు రొమేనియాకు(Romania) చెందిన స్టెఫాన్ మాండెల్(Stefan Mandel).
లక్కుంటే కానీ లాటరీ(Lottery ) తగలవనే అభిప్రాయం తప్పని ప్రూవ్ చేశాడు రొమేనియాకు(Romania) చెందిన స్టెఫాన్ మాండెల్(Stefan Mandel). లెక్కల్లో పరిజ్ఞానం ఉంటే ఎంచక్కా లాటరీ గెల్చుకోవచ్చని రుజువు చేశాడు. లెక్కలతో లాటరీలలోని లాజిక్కును కనిపెట్టేసి, ఏకంగా 14 సార్లు లాటరీ గెల్చుకున్నాడు ఈ గణిత మేథావి. మాథమేటిషియన్ అయిన స్టెఫాన్ మాండెల్ చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. ఏడు వేల రూపాయల జీతం ఏ మూలకు సరిపోయేది కాదు. ఇలాగైతే లాభం లేదనుకుని, గణితాన్ని ఉపయోగించుకుని డబ్బు సంపాదించాలని డిసైడయ్యాడు. అంకెలను ఉపయోగించి ఓ సూత్రాన్ని(Formula) రెడీ చేశాడు. దాని సాయంతో లాటరీలు గెల్చుకుంటూ వచ్చాడు. చాన్నాళ్ల పాటు పరిశోధనలు చేసి ప్రత్యేక అల్గారిథమ్‌ను సృష్టించాడు స్టెఫాన్. సంఖ్యల ఎంపికకు అల్గారిథమ్‌ను సిద్ధం చేసుకుని దానికి కాంబినేటోరియల్ కండెన్సేషన్ అనే పేరు పెట్టారు. తాను ఎన్ని లాటరీ టిక్కెట్లు కొన్నప్పటికీ, వాటికి అయ్యే ఖర్చు జాక్‌పాట్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని స్టెఫాన్ కనుగొన్నాడు. జాక్‌పాట్‌ను గెల్చుకోవడానికి వివిధ కాంబినేషన్‌లలో ఎక్కువ మొత్తంలో లాటరీ టిక్కెట్లు కొనేవాడు. ఇది క్లిక్ అవడంతో స్టెఫాన్ లాటరీలను సొంతం చేసుకుంటూ వచ్చాడు. అటు తర్వాత స్టెఫాన్ లాటరీ సిండికేట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో చేరిన వారు స్టెఫాన్ సూచించిన విధంగా లాటరీ టికెట్లు కొనేవారు. వారు కూడా గెలుపు అవకాశాలను పెంచుకోసాగారు. ఈ విధంగా సిండికేట్‌కు వచ్చే లాటరీ సొమ్మునంతా సభ్యులు సమానంగా పంచుకునేవారు. ఇలా సంపాదించిన డబ్బుతోనే స్టెఫాన్ ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. తాను కనుగొన్న లెక్కల సూత్రం ఆధారంగా మొత్తం 14 సార్లు లాటరీని గెలుచుకున్నాడు. బ్రిటన్‌లో కూడా లాటరీ సిండికేట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దర్యాప్తు సంఘాలకు స్టెఫానపై అనుమానం కలిగింది. పెద్దమొత్తంలో టిక్కెట్లు కొనడంపై నిషేధం విధించాయి. ఇదే సమయంలో స్టెఫాన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. లాయర్లకు ఫీజు చెల్లింపుల కోసం బోల్డంత ఖర్చు అయ్యింది. సంపాదించిన సొమ్మంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. 1995లో దివాలా తీసినట్టు స్టెఫాన్ ప్రకటించాడు. ప్రస్తుతం వనాటు ఐలాండ్‌లో తన ఫ్రెండ్‌తో ఉంటున్నాడు స్టెఫాన్. 1960-70ల కాలంలోనే లాటరీలలో 200 కోట్లకుపైగా డబ్బును గెల్చుకున్నాడు స్టెఫాన్.