ప్లీజ్‌ పాకిస్తాన్‌కు రండి... టీమిండియాకు అఫ్రిది విజ్ఞప్తి

వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో(Pakistan) జరిగే ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో(ICC championship) టీమిండియా(Team India) పాల్గొంటుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. పాకిస్తాన్‌లో(Pakistan) అయితే తాము ఆడబోమని , హైబ్రిడ్‌ విధానంలో టోర్నమెంట్‌ను నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని భారత్‌ ఇదివరకే చెప్పింది. అంటే ఇండియా ఆడే మ్యాచ్‌లను ఏ దుబాయ్‌లోనో, శ్రీలంకలోనో నిర్వహించాలన్నమాట! ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది(shahid afridi) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్‌ జట్టు తమ దేశంలో పర్యటించాలని విన్నవించుకున్నాడు. పాకిస్తాన్‌లో టీమిండియా ఆడితే చూడాలని తామంతా కోరుకుంటున్నామన్నాడు. బీసీసీఐ మాత్రం టీమిండియాను అక్కడికి పంపడానికి సుముఖంగా లేదు. నిరుడు జరిగిన ఆసియా వన్డే కప్‌ టోర్నమెంట్‌లాగే హైబ్రిడ్‌ విధానంలో ముందుకు వెళ్లాలని ఐసీసీని కోరింది.

భారత క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చే చూడాలని ఉందని, రాజకీయాలతో ఆటను ముడిపెట్టకూడదని అఫ్రిది అన్నాడు. టీమిండియాను పాకిస్తాన్‌కు పంపించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. విరాట్‌ కోహ్లీకి తమ దేశంలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందని, అతడిని చూసేందుకు పాక్‌ ప్రజలు తహతహలాడుతున్నారని అన్నాడు. ఇండియాలోని అభిమానుల ప్రేమను మరిపించేలా కోహ్లీని తమ ప్రేమలో ముంచెత్తుతామని చెప్పాడు. 'భారత క్రికెట్‌ జట్టు తప్పకుండా ఇక్కడికి రావాలి. మేము ఇండియాలో పర్యటించినపుడు మాకెంతో ఘనంగా స్వాగతం పలకడం పాటు గౌరవమర్యాదలు ఇచ్చారు. అదే విధంగా మా దేశంలో టీమిండియాను 2005లో ఇలాగే సాదరంగా ఆహ్వానించాం. రాజకీయాలకు అతీతంగా క్రికెట్‌ను చూడాలి. ఒక్కసారి విరాట్‌ కోహ్లీ పాకిస్తాన్‌కు వచ్చాడంటే భారత్‌లో తనకు దొరికే ప్రేమను కూడా మరిచిపోతాడు. పాక్‌లో కోహ్లీకి అంతటి క్రేజ్‌ ఉంది. ఇక్కడి వారికి కోహ్లీ అంటే ఎంతో ఇష్టం ' అని షాహిద్‌ అఫ్రిది అన్నాడు.

Eha Tv

Eha Tv

Next Story