చాలా మందికి 40 అంతస్తుల భవంతిని చూస్తేనే కళ్లు తిరుగుతాయి.

చాలా మందికి 40 అంతస్తుల భవంతిని చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అంతకంటే ఎత్తున్న బిల్డింగ్‌లు మన దేశంలో చాలానే ఉన్నాయి. కానీ కిలోమీటర్‌ ఎత్తున్న భవంతి చూస్తే ఏమవుతారో మరి! కిలోమీటర్‌ ఎత్తున్న బిల్డింగ్(Building) కట్టడం సాధ్యమేనా? అన్న ప్రశ్నను సౌదీ అరేబియాను(Saudi arabia) అడక్కండి.. నవ్వేసుకుంటుంది. ఎందుకంటే ఆ ఎడారి దేశం ఇప్పటికే ఎన్నో రికార్డును బ్రేక్ చేసింది. ప్రపంచ రికార్డులను సృష్టించడం ఆ దేశానికే సాధ్యం. ఆ దేశంలో ఎడారి మధ్యలో 170 కిలోమీటర్ల పొడవైన నగరం ద లైన్‌ నిర్మాణ దశలో ఉంది. అక్కడే జేఈసీ టవర్స్‌ పేరుతో కిలోమీటరు ఎత్తున్న భవన నిర్మాణం జరుగుతోంది. అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే 1007 మీటర్ల ఎత్తున్న ఈ భవంతి 2028 నాటికి అందుబాటులోకి వస్తుంది. కిలోమీటర్‌ కన్నా పిసరంత ఎక్కువ ఎత్తన్న మాట! ప్యారిస్‌లో ఉన్న ఈఫిల్‌ టవర్‌(Eiffel Tower) కన్నా మూడు రెట్లు ఎక్కవ ఎత్తన్నమాట! న్యూ యార్క్‌లోని(new york) ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌కు డబుల్‌ ఉంటుంది. మన దేశంలో అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ పేరు లోఖండ్‌వాలా మినర్వా. దీని ఎత్తు 301 మీటర్లు. 78 అంతస్తులు ఉంటుంది. జేఈసీ టవర్స్‌ దీనికి మూడు రెట్లు ఉటుందన్న మాట! ఈ జేఈసీ టవర్స్‌కు మొదట అనుకున్న పేరు ‘కింగ్‌డమ్‌ టవర్‌. మైలు ఎత్తులో ఈ భవంతిని నిర్మిద్దామనుకున్నారు. కాకపోతే ఇసుక నేలల్లో ఇంత ఎత్తైన భవనం కట్టలేమని ఇంజనీర్లు చెప్పడంతో కిలోమీటర్‌కు పరిమితం చేశారు. ముందు జెడ్డా టవర్స్‌ అని పేరు పెడదామనుకున్నారు. ఇప్పుడు జెడ్డా ఎకనమిక్‌ టవర్‌ అన్న పేరును ఖాయం చేశారు. దుబాయిలోని ఎత్తు అయిన భవనం ‘బుర్జ్‌ ఖలీఫా’ (828 మీటర్ల ఎత్తు)ను డిజైన్‌ చేసిన ఆడ్రియన్‌ స్మిత్‌, గార్డన్‌ హిల్‌లే జేఈసీ టవర్‌కూ రూపకల్పన చేయడం విశేషం. ఎడారిలో పెరిగే ఓ చెట్టు ఆకులలాగే త్రికోణ ఆకారంలో ఆకాశాన్ని అంటేలా ఉంటుందీ భవనం. ఎర్ర సముద్ర తీరంలోని జెడ్డా నగరం బీచ్‌ ఒడ్డునే కడుతున్నారు. భవనం ఎత్తు పెరిగిన కొద్దీ పై అంతస్తుల్లో గాలి చాలా బలంగా వీస్తుంటుంది కాబట్టే జేఈసీ టవర్‌ నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బలమైన గాలులను తట్టుకునేట్టుగా నిర్మిస్తున్నారు. సూర్యుడి ఎండ వేడిని తగ్గించడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇసుక నేలలో సుమారు 344 అడుగుల లోతైన 270 కాంక్రీట్‌ దిమ్మెల పునాదులపై ఈ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారు. లోఖండ్‌ వాలా మినర్వాలో మొత్తం 78 అంతస్తులు ఉంటే, జేఈసీ టవర్‌లో ఏకంగా 157 అంతస్తులు ఉంటాయి. మొత్తం 59 లిఫ్ట్‌లు ఉంటాయి. అలాగే బుర్జ్‌ ఖలీఫాలో దుబాయి నగరం మొత్తాన్ని చూసేందుకు 128వ అంతస్తులో ఏర్పాట్లు ఉన్నాయి. . జేఈసీ టవర్‌లో ఇంతకంటే ఎత్తయిన అంతస్తులో వ్యూ పాయింట్‌ ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు మాత్రమే కాకుండా.. ఒక లగ్జరీ హోటల్‌, కార్యాలయాలు కూడా భవనం లోపల ఏర్పాటవుతాయి. నిజానికి పదేళ్ల కిందటే జేఈసీ టవర్‌ నిర్మాణం మొదలయ్యింది. 60 అంతస్తులు కట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి. మూడేళ్ల కిందట మళ్లీ పనులు మొదలయ్యాయి. అన్నట్టు ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 720 కోట్ల సౌదీ అరేబియా రియాళ్లు! మన కరెన్సీ లో చెప్పుకోవాలంటే

159,662,700,000 రూపాయలు. పదిహేను వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ!

Updated On 11 Oct 2024 2:31 PM GMT
Eha Tv

Eha Tv

Next Story