Essequibo country : ఎసెక్విబో ప్రాంతం కోసం వెనెజులా, గయానాలు ఎందుకు గొడవ పడుతున్నాయి? ఆ ప్రాంతం ప్రత్యేకత ఏమిటి?
ప్రపంచంలో చాలా చోట్ల అశాంతులు, అలజడులు. యుద్ధాలు, ఘర్షణలు. ఓ పక్క రష్యా(Russia)-ఉక్రెయిన్(Ukrain) మధ్య యుద్ధం, మరో పక్క పాలస్తీనాపై(Palestine) ఇజ్రాయెల్(Israel) దాడులు. తైవాన్‌పై చైనా దూకుడు. ఇలా ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఇవి సరిపోవన్నట్టుగా దక్షిణ అమెరికాలో కూడా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పేరుకు గయానా(Gayana) చాలా చిన్నదేశమే అయినప్పటికీ ఆ దేశం ఆధీనంలో ఉన్న ఎసెక్విబో(Essequibo) ప్రాంతంలో అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి. వీటిపై పక్కనే ఉన్న వెనెజులా(Venezuela) దృష్టి పెట్టింది.
ప్రపంచంలో చాలా చోట్ల అశాంతులు, అలజడులు. యుద్ధాలు, ఘర్షణలు. ఓ పక్క రష్యా(Russia)-ఉక్రెయిన్(Ukrain) మధ్య యుద్ధం, మరో పక్క పాలస్తీనాపై(Palestine) ఇజ్రాయెల్(Israel) దాడులు. తైవాన్‌పై చైనా దూకుడు. ఇలా ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఇవి సరిపోవన్నట్టుగా దక్షిణ అమెరికాలో కూడా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పేరుకు గయానా(Guyana ) చాలా చిన్నదేశమే అయినప్పటికీ ఆ దేశం ఆధీనంలో ఉన్న ఎసెక్విబో(Essequibo) ప్రాంతంలో అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి. వీటిపై పక్కనే ఉన్న వెనెజులా(Venezuela) దృష్టి పెట్టింది. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పూర్తిగా కబళించడానికి పన్నాగాలు పన్నుతోంది. ఇదే ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గాయనాకు అమెరికా(America) పూర్తి సపోర్ట్ ఉంది. వెనుజులాతో అమెరికాకు ఎప్పట్నుంచో ఘర్షణలు ఉన్న విషయం తెలిసిందే కదా! దీంతో పరిస్థితులు రోజురోజుకూ భయంకరంగా మారుతున్నాయి. రెండు దశాబ్దాలుగా దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో ప్రాంతంపై వెనుజులా, గయానా కొట్టుకుంటూనే వస్తున్నాయి. ఆ ప్రాంతం తమదని వెనుజులా, కాదు మాదని గయానా వాదిస్తున్నాయి.
అయితే వందేళ్ల నుంచి ఈ ప్రాంతం గయానా అధీనంలోనే ఉంది. ఈ ప్రాంతంపై కొన్ని దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యుగో చావెజ్ ఈ వివాదానికి ముగింపు పలికారు. దాంతో ఉద్రిక్తతలు సమసిపోయాయి. అయితే ఎసెక్విబోను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాలలో ఏకంగా 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నట్లు 2015లో బయటపడింది. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆ నిల్వలపై వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కన్నుపడింది. ఎసెక్విబో తమదేనని ఇప్పుడు వాదిస్తున్నారు. పదే పదే ఆ ప్రాంతం గురించి ప్రస్తావిస్తున్నారు. ఎసెక్విబోను వెనెజులాలో కలిపేసుకుంటామని ప్రకటించారు. విలీనంపై వెనెజులాలో రిఫరెండం నిర్వహిస్తామని అన్నారు. దీంతో గయానా గయ్యిమంది.
అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకోవద్దని వెనెజులాను కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు వచ్చి రెండు రోజులు కూడా కాలేదు వాటిని వెనెజులా బేఖాతరు చేసింది. డిసెంబర్ 3వ తేదీన వెనెజులా వ్యాప్తంగా రిఫరెండం నిర్వహించారు ముదురో. 95 శాతం మంది ఎసెక్విబో విలీనానికి జై కొట్టినట్టు ప్రకటించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో కొత్త రాష్ట్రంగా చూపుతున్న కొత్త మ్యాపులను విడుదల చేశారు ముదురో. ఇదిలా ఉంటే గయానాపై వెనెజులా సైనిక చర్యకు దిగవచ్చనే వార్తలు వస్తున్నాయి. అందుకే అమెరికా రంగంలోకి దిగింది. గయానాకు పూర్తి మద్దతును ప్రకటించింది. డిసెంబర్ 7వ తేదీ నుంచి గయానాలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తోంది.
నిజానికి గయానాపై అమెరికాకు ప్రేమ ఎందుకంటే అక్కడ ఉన్న చమురు నిక్షేపాలే కారణం. ఎసెక్వెబోలో చమురు నిల్వలను గుర్తించిన ఎక్సాన్‌మొబిల్ సంస్థ అమెరికాకు చెందినదే! 2022లోనే చమురు వెలికితీత ద్వారా ఆ కంపెనీ 600 కోట్ల డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇంత ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఎసెక్విబోను అమెరికా ఎలా వదులుకుంటుంది? ఎసెక్విబోపై దాడి చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆ ప్రాంతం దట్టమైన అడవులతో ఉంటుంది. సముద్ర మార్గం ద్వారానే దాడి చేయగలరు. లేకపోతే రెండు దేశాలలో సరిహద్దును పంచుకుంటున్న బ్రెజిల్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కూడా వెనెజులాతో తమ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ముదురోకు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 14వ తేదీన ఆయన సమక్షంలో సమావేశమై వివాదంపై చర్చించుకునేందుకు మదురో, గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అంగీకరించారు.
వెనుజులా ఒకప్పుడు స్పెయిన్ వలస రాజ్యంగా ఉండింది. అప్పట్లో ఎసెక్విబో ప్రాంతం వెనుజులా ఆధీనంలోనే ఉండేది. 1899 దాకా అలాగే కొనసాగింది. 1899లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గయానాకు ఆ ప్రాంతం వెళ్లింది. అయితే అది మోసపూరిత ఒప్పందమని వెనెజులా అప్పట్నుంచి ఆరోపిస్తూ వస్తున్నది. తమ ప్రాతినిధ్యం లేకుండానే తమ తరఫున అమెరికా, బ్రిటన్‌లు దీనికి అంగీకారం తెలిపాయని వెనెజులా అంటోంది. ఎసెక్విబో ప్రాంతంలో అపార సహజ వనరులు ఉన్నాయి. దీని విస్తీర్ణం లక్షా 59 వేల చదరపు కిలోమీటర్లు. గయానా మొత్తం విస్తీర్ణంలో మూడింట రెండువంతులు ఈ ప్రాంతమే విస్తరించి ఉంది. గయానా మొత్తం జనాభా ఎనిమిది లక్షలు. ఎసెక్విబోలో ఉంటున్నది 1.2 లక్షల మంది మాత్రమే. ఈ ప్రాంతం దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలలో నిండి ఉంది. బంగారం, రాగి వంటి ఖనిజ నిల్వలు కూడా ఉన్నాయి.
గయానాపై దాడికి దిగాలన్న ఉద్దేశం మదురోకు లేదు కానీ 2013 నుంచీ అధికారంలో ఉన్న మదురోపై వెనెజులాలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. దేశంలో పేదరికం పెరిగింది. ప్రజలలలో మదురోపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో యుద్ధం పేరిట భావోద్వేగాలు రెచ్చగొడతే ప్రజలలో వ్యతిరేకత తగ్గించుకోవన్నది మదురో ఆలోచన.