India-Qatar : ఖతార్‌లో ఎనిమిది భారతీయులకు మరణశిక్ష రద్దు
ఖతార్(Qatar)లో మరణశిక్ష పడిన ఎనిమిది భారతీయులు(Indians) విడుదలయ్యారు. భారత్ దౌప్యపరంగా ఇది విజయమేనని చెప్పుకోవాలి. ఎనిమిది మంది భారతీయులలో ఇప్పటికే ఏడుగురు భారత్‌కు తిరిగి వచ్చారు.
ఖతార్(Qatar)లో మరణశిక్ష పడిన ఎనిమిది భారతీయులు(Indians) విడుదలయ్యారు. భారత్ దౌప్యపరంగా ఇది విజయమేనని చెప్పుకోవాలి. ఎనిమిది మంది భారతీయులలో ఇప్పటికే ఏడుగురు భారత్‌కు తిరిగి వచ్చారు. భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లు దోహాకు చెందిన అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్(Dahra Global Technologies)లో పనిచేసేవారు. గూఢచర్యం ఆరోపణలపై 2022, ఆగస్టులో వీరిని అరెస్ట్ చేశారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీ ఖతార్ సైనిక దళాలకు, ఇతర భద్రతా సంస్థలకు శిక్షణ, ఇతర సేవలను అందిస్తుంది. వీరంతా ఏడాదికిపైగా జైల్లో ఉన్నారు. ఆ తర్వాత వీరికి గత ఏడాది అక్టోబర్‌లో ఖతార్‌లోని దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం భారత్‌కు ఇవ్వకపోవడం గమనార్హం. అప్పట్నుంచి ఆ ఎనిమిది మందితో పాటు వారి కుటుంబసభ్యులు దేవుడి మీద భారం వేసి ఉన్నారు. ఎంతో మానసిక క్షోభను అనుభవించారు. దీంతో ఈ నిర్ణయంపై భారత్ అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరిగిన నేపధ్యంలో ఆ ఎనిమిది మంది అధికారుల మరణశిక్షను ఖతార్ రద్దు చేసింది. ఖతార్ అదుపులో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్‌పాల్, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ మన విశాఖకు చెందిన వారు. అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపి మరణ శిక్షను ఖరారు చేసింది. దీన్ని రద్దు చేయించేందుకు భారత్ దౌత్యపరంగా అనేక ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. చివరకు పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ శిక్షను జైలు శిక్షగా మారుస్తూ డిసెంబర్ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న భారత్ వారి విడుదల కోసం ప్రయత్నించింది. అవన్నీ ఫలించి వారు జైలు నుంచి విముక్తులయ్యారు.