Modi On Robert Fico: స్లొవేకియా ప్రధానిపై దాడిని ఖండించిన ప్రధాని మోదీ
ఇది హేయమైన, పిరికి చర్య అని ప్రధాని మోదీ అభివర్ణించారు
స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది హేయమైన, పిరికి చర్య అని ప్రధాని మోదీ అభివర్ణించారు. బుధవారం రాబర్ట్ ఫికోపై జరిగిన హత్యాయత్నంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తన X హ్యాండిల్‌లో "స్లోవేకియా ప్రధాన మంత్రి, H.E. రాబర్ట్ ఫికోపై కాల్పుల వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను ఈ పిరికిపంద, దారుణమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రధానమంత్రి ఫికో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్లోవాక్ రిపబ్లిక్ ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది." అని పోస్టు చేశారు. స్థానిక మీడియా ప్రకారం, శస్త్రచికిత్స తర్వాత స్లోవాక్ ప్రధాని రాబర్ట్ ఫికో ప్రాణాపాయ స్థితిలో లేరని తెలుస్తోంది.
రాబర్ట్ ఫికో.. హాండ్లోవాలో మంత్రిమండలి సమావేశంలో పాల్గొని తిరిగివస్తున్న సమయంలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. పలుమార్లు కాల్పులు జరపడంతో ప్రధానికి పొట్ట, తల భాగంలో గాయాలయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు.