Shaik Haseena : ప్రజాగ్రహజ్వాలల్లో మాడిపోయిన అధినేతలు వీళ్లే!
ప్రజాగ్రహం ముందు ఎవరైనా తలవంచక తప్పదు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చినట్టు ఎంతటి బలవంతులైనా నేలమీదకు రావాల్సిందే
ప్రజాగ్రహం ముందు ఎవరైనా తలవంచక తప్పదు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చినట్టు ఎంతటి బలవంతులైనా నేలమీదకు రావాల్సిందే! ఎంత మందిని చూళ్లేదూ? పెద్ద పెద్ద నియంతలే ప్రజాగ్రహజ్వాలల్లో మాడిమసైపోయారు. అధికారం ఉందని విర్రవీగినవారంతా తట్టాబుట్టా సర్దుకుని పారిపోయారు. బంగ్లాదేశ్‌లో(Bangladesh) పదిహేనేళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగిన షేక్ హసీనాకు(shaik haseena) ఇదే జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాకు సంబంధించి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పదవి వదిలిపెట్టి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇలా ప్రజల ఆందోళనలతో దేశాధినేతలు పదవి కోల్పోవడం ఇదేం మొదటి సారి కాదు. రెండు దశాబ్దాలలో వివిధ దేశాలకు చెందిన పది మంది అధినేతలు ఇలాగే తమ పదవులను వదిలిపెట్టారు. రెండేళ్ల కిందట అంటే 2022లో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు ఇదే గతి పట్టింది. ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక చిక్కుకుపోవడంతో నిరసన జ్వాలలు మిన్నంటాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అధికార నివాసాన్ని ప్రజలు చుట్టుముట్టారు. దెబ్బకు దేశం విడిచిపారిపోయారు రాజపక్సే. బంగ్లాదేశ్‌లోలాగే రాజపక్సే ఇంట్లోకి జనం దూసుకెళ్లారు. 2018లో ఆర్మేనియాలో ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రధానమంత్రి సెర్జ్ సార్గిసన్(Serge Sarkisian) పాలనపై జనాల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. అది ఆగ్రహంగా మారింది. ఏప్రిల్ 23న నిరసనకారులు, సైన్యం కలిసి సెర్జ్ సార్గిసన్‌ను పదవి నుంచి తప్పించాయి. 2017లో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే(Robert mugabe) కూడా జనాగ్రహాన్ని చవిచూశారు. 2017 నవంబర్‌లో దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి. సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ముగాబేతో సైన్యం బలవంతంగా రాజీనామా చేయించింది. 2013లో బల్గేరియాలో విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిచింది. ప్రధానమంత్రి బోరిసోవ్‌ను జనం ఈసడించుకున్నారు. ఆందోళన చేశారు. ఉద్యమాలు చేశారు. ఫలితంగా ఫిబ్రవరిలో బోరిసోవ్ రాజీనామా చేశారు. అప్పుడు జనం శాంతించారు. 2011లో ఈజిప్ట్‌లో పాలనాధినేత హోస్ని ముబారక్‌ను ప్రజలు గద్దె దించారు. ప్రజా ఆందోళనలకు జడిసిన ముబారక్ ఫిబ్రవరిలో పదవి నుంచి తప్పుకున్నాడు. అదే ఏడాది ట్యునీషియాలోనూ తిరుగుబాటు జరిగింది. పెరిగిపోతున్న నిరుద్యోగం, అధిక ధరలకు వ్యతిరేకంగా జనం రోడ్ల మీదకు వచ్చారు. దేశమంతటా నిరసనజ్వాలలు చెలరేగాయి. దాంతో జనవరి 15న అధ్యక్షపదవికి అబిదిన్ బెన్ అలీ రాజీనామా చేసి బతుకు జీవుడా అనుకుటూ సౌదీ అరేబియాకు పారిపోయాడు. 2009లో ఐస్‌ల్యాండ్ ప్రధానమంత్రి హార్డే అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నాడు. ఫలితంగా దేశ కరెన్సీ, బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలింది. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో ప్రధానమంత్రి పదవికి హార్డే రాజీనామా చేశారు. మన పొరుగున ఉన్న శ్రీలంకలో ఇదే జరిగింది. 2006లో రాచరిక వ్యవస్థపై ప్రజలు తిరగబడ్డారు. దాంతో నేపాల్ రాజు జ్ఞానేంద్ర సింహాసనం దిగారు. 2005లో లెబనాన్‌లో మాజీ ప్రధానమంత్రి రఫిక్ హారిరిని హత్య చేశారు దుండగులు. దాంతో లెబనాన్ అంతటా నిరసనలు జరిగాయి. దాంతో ప్రధానమంత్రి ఒమర్ కరామి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.