Jensen Huang :మీ అందరికంటే ఎక్కువ టాయిలెట్లు నేనే కడిగా: టాప్ కంపెనీ సీఈవో
ఈ ఏడాది మార్చిలో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్(Jensen Huang) చేసిన ప్రసంగం వీడియోను ఈ మధ్య కాలంలో ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఏడాది మార్చిలో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్(Jensen Huang) చేసిన ప్రసంగం వీడియోను ఈ మధ్య కాలంలో ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై 'ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్(Elon musk) సహా వేలాది మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన జెన్సన్ హువాంగ్.. జీవితంలో ఎవరూ ఒకేసారి పైకి ఎదగరని.. ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఎవరి పనిని చులకన చేసి చూడడం లేదా తక్కువ చేసి చూడడం సరికాదని అన్నారు. కెరీర్ ప్రారంభించినప్పుడు తాను ఎన్నోవందల సార్లు టాయిలెట్లు శుభ్రం చేసేవాడినని చెప్పుకొచ్చారు.
తన వరకు ఏదీ కూడా చిన్న పని కాదని.. తన కెరీర్ తొలినాళ్లలో ఓ బ్రేక్‌పాస్ట్ సెంటర్‌లో పనిచేశానని తెలిపారు. ఆ సమయంలో గిన్నెలు కడిగేవాడినని, టాయిలెట్లు కూడా వందల సార్లు శుభ్రం చేశానని అన్నారు. అంతెందుకు మీ అందరి కంటే టాయిలెట్లు కడిగిన వాడిలో నేనే ముందుంటానని చెప్పారు. ఆ అనుభవమే తనకు అన్ని రకాల పనులను గౌరవించడం నేర్పిందని అన్నారు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులను అందుకే సమానంగా చూడగల్గుతానని, వారి కష్టనష్టాలకు అండగా ఉండడం అనుభవం ద్వారే వచ్చిందని అన్నారు. ప్రపంచంలో తక్కువ పని అంటూ ఏదీ లేదని ఎవరి స్థాయిలో చేసే పని వారికి అదే ఎక్కువ అని వివరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అంత పెద్ద కంపెనీకి సీఈవోగా ఉన్న హువాంగ్ చాలా చక్కటి అనుభవాలను షేర్ చేసుకున్నారని నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.