అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) దోషిగా తేలారు. పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపులు (హుష్‌ మనీ) చేసిన కేసులో ట్రంప్‌ను న్యూయార్క్‌ కోర్టు దోషిగా తేల్చింది. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి క్రిమినల్ కేసులో దోషిగా తేలడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) దోషిగా తేలారు. పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపులు (హుష్‌ మనీ) చేసిన కేసులో ట్రంప్‌ను న్యూయార్క్‌ కోర్టు దోషిగా తేల్చింది. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి క్రిమినల్ కేసులో దోషిగా తేలడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్‌తో వివాహేతర సంబంధం కేసులో ట్రంప్‌పై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్టు కోర్టు తెలిపింది. ట్రంప్‌పై మోపిన మొత్తం 34 అభియోగాలు రుజువైనట్లు 14 సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. అయితే జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన బైడెన్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. జులై 11వ తేదీన తుది తీర్పు వెలువరించడంతో పాటు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. నాలుగేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. 2006లో తనను లైంగికంగా వాడుకున్న ట్రంప్‌ ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని శృంగార తార‌ స్టార్మీ డేనియల్స్‌ హుష్‌మనీ కేసు ఫైల్‌ చేసిన విషయం తెలిసిందే! ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని పేర్కొన్నారు. అందుకోసం బిజినెస్‌ రికార్డులన్నింటినీ ట్రంప్‌ తారుమారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. తాజా కోర్టు తీర్పుతో ట్రంప్‌ (Trump) అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని న్యాయనిపుణులు తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. నేరారోపణలు రుజువైతే ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగాలనే నిబంధనేమీ లేదు. 1920లో ఓ సోషలిస్ట్‌ నేత జైలులో ఉండే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేశారని కొందరు గుర్తుచేశారు. తాజాగా ట్రంప్ సైతం యథావిధిగా ప్రచారం కొనసాగించ వచ్చని అన్నారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, చాలా అమాయకుడినని ట్రంప్‌ చెప్పారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. చివరకు పోరాడుతూనే ఉంటానని, గెలుస్తానని ట్రంప్‌ అన్నారు.

Updated On 31 May 2024 4:28 AM GMT
Ehatv

Ehatv

Next Story