Sunitha Williams : అప్పటి వరకు సునీత అంతరిక్షంలోనే ఉండాలా?
ఇప్పట్లో భూమ్మీదకు సునీతా విలియమ్స్ వచ్చే ఛాన్స్ లేదు!
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్(sunitha williams) మూడోసారి అంతరిక్షంలో(Space) అడుగుపెట్టారు. భూమ్మీదకు వచ్చేద్దామనుకుంటే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆమె రాక మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. ఆమె మరో ఎనిమిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె తిరిగి రావచ్చని నాసా(NASA) చెబుతున్నది. ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా జూన్ 6వ తేదీన సునీత, విల్‌మోర్ బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. నిజానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమ్మీదకు బయలుదేరాలి. కానీ స్పేస్‌షిప్‌లో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్లు తలెత్తాయి. ఇప్పటికీ ఆ సమస్యలు అలాగే ఉండటంతో రెండు నెలలుగా సునీత, విల్‌మోర్‌లు(Butch Wilmore) అక్కడే ఉంటున్నారు. ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఎప్పుడు సునీత భూమికి వస్తారో చెప్పడం లేదు. అయితే ఇప్పుడు నాసా ఓ ప్రకటన చేసింది. ‘బోయింగ్ స్టార్‌లైనర్ తిరిగి భూమ్మీద ల్యాండ్ అయ్యేందుకు సురక్షితంగా లేకపోతే వ్యోమగాములను తీసుకొచ్చేందుకు ఎంచుకున్న ఆప్షన్లలో ఒకటి 2025 ఫిబ్రవరిలో ఉంది. అది కూడా స్పేక్స్‌ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో' అని నాసా తెలిపింది. అంటే సునీత, విల్‌మోర్ మరో ఎనిమిది నెలలు ఐఎస్‌ఎస్‌లోనే ఉండాల్సి వస్తుంది. ఆ ఇద్దరిని తీసుకురావడానికి నాసా అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. స్పేక్స్ క్రూ -9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను పంపించే ఛాన్సు ఉంది. వచ్చే నెల ఈ ప్రయోగం ఉండవచ్చని అంటున్నారు. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత, విల్‌మోర్‌ను భూమికి తీసుకురావాలనుకుంటున్నారు. అయితే స్టార్‌లైనర్‌లో వారిని తీసుకురావాలా? లేక క్రూ డ్రాగన్‌ను ప్రయోగించాలా అన్నదానిపై నాసా ఓ నిర్ణయానికి రాలేదు. అంతరిక్ష కేంద్రంలో వారిద్దరు క్షేమంగానే ఉన్నారని, వారు సౌకర్యవంతంగానే ఉన్నారని నాసా చెప్పింది. కాకపోతే ఇలా ఎక్కువ రోజుల పాటు అంతరిక్షకేంద్రంలో ఉంటే వీరికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అంతరిక్షానికి సునీతా విలియమ్స్ వెళ్లడం ఇది మూడోసారి. ఇంతకు ముందు 2006లో, 2012లో ఐఎస్ఎస్‌కు వెళ్లారు.