సునీతా విలియమ్స్‌(sunitha wiiliams) ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోకి(International space station) వెళ్లి నెల రోజులకు పైగానే అయ్యింది.

సునీతా విలియమ్స్‌(sunitha wiiliams) ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోకి(International space station) వెళ్లి నెల రోజులకు పైగానే అయ్యింది. ఈ పాటికి ఆమె భూమ్మీదకు వచ్చేయాలి. కానీ బోయింగ్‌ వ్యోమనౌకలో తలెత్తిన సమస్యల కారణంగా ఆమె అక్కడే ఉన్నారు. నెల రోజులుగా ఆమె కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. తిరుగు ప్రయాణానికి మరింత సమయం పట్టేట్టు ఉంది. ప్రస్తుతం ఆమె పరిశోధనలలో కాలం గడిపేస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఉన్న సునీతా విలియమ్స్‌ తమ అంతరిక్ష యాత్ర గురించి లైవ్‌లో మాట్లాడనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 8.30కు ఈ కార్యక్రమం ఉంటుంది. నాసా టీవీ(NASA TV), నాసా యాప్, సంస్థ వెబ్‌సైట్‌తో పాటు యూట్యూబ్‌లో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు.

భారత మూలాలు ఉన్న సునీతా విలియమ్స్‌ తన సహచరుడు బారీ బుచ్‌ విల్మోర్‌తో కలిసి బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో జూన్‌ 5వ తేదీన అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. ఆమెకు ఇది ముచ్చటగా మూడో అంతరిక్ష యాత్ర. అంతరిక్ష కేంద్రానికి చేరిన తర్వాత వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలు(technical issues) వచ్చాయి. దాంతో ఆమె అక్కడే చిక్కుబడిపోయారు.

నాసా తలపెట్టిన మరమ్మతులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. సునీత ఎప్పుడు సురక్షితంగా తిరిగొస్తారన్న దానిపై కూడా స్పష్టత లేదు. ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ మొదలుకుని వ్యోమ నౌకలో పలు లోపాలు ఏర్పడ్డాయి. ఎలాగైతేనేమీ జూన్‌ 6వ తేదీన స్టార్‌లైనర్‌ సురక్షితంగా ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం సునీత, విల్మోర్‌ వారం పాటు ఇంటర్నేషనల్‌ స్పెస్‌ స్టేషన్‌లో ఉండి జూన్‌ 13వ తేదీన అక్కడి నుంచి బయలుదేరాలి. జూన్‌ 14వ తేదీన భూమికి చేరుకోవాలి.

ప్రస్తుతం లోపాలను సరిచేసే పనిలో నాసా ఉంది. వ్యోమగాములను వెనక్కు తీసుకొచ్చే విషయంలో తొందరేమీ లేదని నాసా చెబుతోంది. వారి భద్రతే తమకు అంత్యంత ప్రాధాన్యమని చెప్పింది. స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్‌లో అయిదు చోట్ల హీలియం లీకేజీలు ఉన్నాయి. నిజానికి ఇది పెద్ద సమస్యే. దీంతోపాటు వ్యోమ నౌకలో కీలకమైన 28 రియాక్షన్‌ కంట్రోల్‌ సిస్టం థ్రస్టర్లలో అయిదు ఫెలయినట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి ఉన్నట్టుండి పని చేయడం మానేశాయి. సురక్షితంగా తిరిగి రావాలంటే కనీసం 14 థ్రస్టర్లు సజావుగా పని చేయాలి. వీటిని పరిశీలిస్తున్నప్పుడే మరిన్ని సాంకేతిక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. థ్రస్టర్లలో ప్రస్తుతానికి నాలుగింటిని రిపేర్‌ చేశారని, అవి సజావుగా పని చేస్తున్నాయని అంటున్నారు. ఈ ప్రాబ్లమ్స్‌ను సరి చేయడానికి బోయింగ్‌ బృందం నాసాతో కలిసి పని చేస్తోంది. బోయింగ్‌ స్టార్‌లైనర్‌ గరిష్టంగా 45 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమై ఉండగలదు. అది జూన్‌ 6వ తేదీన అక్కడికి చేరింది. అంటే జూలై 22వ తేదీ వరకు సమయముంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే అన్న భయం అక్కర్లేదు. ఎందుకంటే సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. స్పేస్‌ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ ద్వారా, లేదంటే రష్యా సూయజ్‌ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకురావచ్చు. అంచేత టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు.

Eha Tv

Eha Tv

Next Story