Salt Mountain : 114 ఫుట్‌బాల్ స్టేడియంలను కప్పేసేటంత ఉప్పుకొండను ఎక్కడైనా చూశారా.?
అంతెత్తున ఉన్న ఉప్పు కొండను ఎక్కడైనా చూశారా? పోనీ అలాంటి కొండ ఒకటుందని ఎక్కడైనా విన్నారా? జర్మనీలోని హెర్రింజన్ సిటీకి వెళితే ఉప్పు కొండను చూడొచ్చు. అదేమీ ప్రకృతి సిద్ధంగా వెలిసిన కొండ కాదు.. మనుషులే ఆ పెద్ద కొండను తయారు చేశారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద కృత్రిమ కొండగా అవతరించింది.
అంతెత్తున ఉన్న ఉప్పు కొండను ఎక్కడైనా చూశారా? పోనీ అలాంటి కొండ ఒకటుందని ఎక్కడైనా విన్నారా? జర్మనీలోని హెర్రింజన్ సిటీకి వెళితే ఉప్పు కొండను చూడొచ్చు. అదేమీ ప్రకృతి సిద్ధంగా వెలిసిన కొండ కాదు.. మనుషులే ఆ పెద్ద కొండను తయారు చేశారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద కృత్రిమ కొండగా అవతరించింది. అసలీ కొండ ఎలా ఏర్పడిందన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం! 1976 ప్రాంతంలో హెస్సెన్ పట్టణం చుట్టుతా గనులుండేవి. వాటి నుంచి తవ్వి పోటాష్ సాల్ట్‌ను వెలికితీసేవారు. దీనికి సబ్బులు, గ్లాసుల తయారీకి ఉపయోగించేవారు. రసాయన ఎరువులు, సింథటిక్ రబ్బర్, కొన్ని రకాల మందుల తయారీలో కూడా ఇది వాడుతున్నారు. పొటాస్ సాల్ట్ తవ్వితే ముడిసరకుగా సోడియం క్లోరైడ్ కూడా వస్తుంది. అంటే ఉప్పు అన్న మాట. అలా వచ్చిన ఉప్పును ఓ చోట పోయడం మొదలెట్టారు. అలా తవ్వుతూ ఉంటే బోల్డంత ఉప్పు పోగైంది.. రాశులుగా పోసిన ఆ ఉప్పే ఇప్పుడు చిన్నపాటి కొండగా మారింది. ఈ ఉప్పు కొండను స్థానికులు ముద్దుగా మోంటెకాలి, కలిమంజారో అని పిల్చుకుంటున్నారు. ఈ కొండ దాదాపు వంద హెక్టార్లలో విస్తరించింది.
ఇప్పటికే సుమారు 236 మిలియన్ టన్నుల ఉప్పు పేరుకుపోయింది. ఈ ఉప్పుతో 114 ఫుట్‌బాల్ స్టేడియంలను కప్పిపెట్టవచ్చు. సముద్ర మట్టానికి 1740 అడుగుల ఎత్తుంటుంది. అంచేత హెర్రింజన్‌లో ఎక్కడ్నుంచి చూసిన ఈ కొండ కనిపిస్తుంది. ఇది కాసింత డిఫరెంట్‌గా ఉండటంతో టూరిస్టులు రావడం మొదలు పెట్టారు. టూరిస్టులు పెరగడంతో కొండను ఎక్కేందుకు టికెట్ పెట్టారు. డబ్బులు పోతే పోనీ మాంచి అనుభూతి మిగులుతుంది కదాని టూరిస్టులు టికెట్ కొనేసి కొండను ఎక్కేస్తున్నారు. శిఖరం చేరుకున్న వారికి వెర్రా వ్యాలీ, థురింజియాన్ అటవీ ప్రాంతం మొత్తం కనిపిస్తుంది. ఉప్పు పర్వతం కారణంగా పర్యావరణ సమస్యలు కూడా వస్తున్నాయి. చుట్టుపక్కల మంచి నీరంతా ఉప్పగా మారుతోంది. క్రిమి కీటకాలు మాయమవుతున్నాయి. ఇలాగే కొండ పెరుగుతూ పోతే మాత్రం పర్యావరణ విధ్వంసం ఖాయమంటున్నారు పరిశోధకులు. కాకపోతే ఆ పొటాష్ పరిశ్రమను నమ్ముకుని చాలామంది జీవిస్తున్నారు. ఉన్న పళంగా ఆ పరిశ్రమను మూసేయడం సాధ్యం కాదు.