తైవాన్‌లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం జపాన్‌లోని దక్షిణ దీవులను వణికించింది. భూకంపం కారణంగా మూడు మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉంది.
తైవాన్‌లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం జపాన్‌లోని దక్షిణ దీవులను వణికించింది. భూకంపం కారణంగా మూడు మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉంది. భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 9 గంటల ముందు భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా తైవాన్ కూడా భారీ వినాశనాన్ని చవిచూసింది. భవనాలు నేలమట్టం అయ్యాయి. భూకంపం కారణంగా కుప్పకూలిన భవనాల్లో ప్రజలు చిక్కుకుపోయారు.
ట్విట్టర్‌లో JMA విపత్తు సంస్థ ఒక పోస్ట్‌లో.. భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలను హెచ్చరించింది. తదుపరి పరిస్థితి తేటతెల్లం అయ్యే వరకు ఆ ప్రాంతం వదిలి వెళ్లవద్దని కోరారు. ట్వీట్ అనువాదం ప్రకారం.. '3వ తేదీ రాత్రి 9:01 గంటల వరకు సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. సునామీలు మళ్లీ మళ్లీ వస్తాయి. హెచ్చరిక ఎత్తివేసే వరకు మీ సురక్షిత స్థలాన్ని వదిలి వెళ్లవద్దు. ఒకినావా, మియాజోకిమా, యాయామా ద్వీప సమూహాలపై 10 అడుగుల ఎత్తు వరకు సునామీ వచ్చే ప్రమాదం ఉందని JMA తెలిపింది.
భూకంప కేంద్రానికి దగ్గరగా తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హువాలియన్ నగరంలో జరిగిన నష్టానికి సంబంధించిన వీడియోలు వెలువడ్డాయి. వాలిన భవనాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంప కేంద్రం హువాలియన్ నగరానికి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. 25 ఏళ్లలో తైవాన్‌లో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు. ఫిలిప్పీన్స్ నుండి కూడా సునామీ హెచ్చరిక జారీ చేయబడింది.