ఇజ్రాయెల్‌(Israel)-హమాస్‌(Hamas) మధ్య యుద్ధం మొదలయ్యి పది రోజులు గడిచిపోయాయి. తమపై ఆకస్మిక దాడి చేసిన హమాస్‌ను మట్టుపెట్టాలన్నా కసి ఇజ్రాయెల్‌లో రోజురోజుకీ పెరుగుతోంది. హమాస్‌ మిలిటెంట్ల స్థావరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని భూతల దాడులకు సైన్య సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లో భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది.

ఇజ్రాయెల్‌(Israel)-హమాస్‌(Hamas) మధ్య యుద్ధం మొదలయ్యి పది రోజులు గడిచిపోయాయి. తమపై ఆకస్మిక దాడి చేసిన హమాస్‌ను మట్టుపెట్టాలన్నా కసి ఇజ్రాయెల్‌లో రోజురోజుకీ పెరుగుతోంది. హమాస్‌ మిలిటెంట్ల స్థావరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని భూతల దాడులకు సైన్య సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లో భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. ఇప్పటికే గాజా(Gaza) సరిహద్దుకు మూడు లక్షలకు పైగా ఇజ్రాయెల్‌ రిజర్వ్‌ సైనికులు చేరుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.

పది రోజుల యుద్ధంలో 2.750 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. సుమారు పది వేల మంది గాయపడ్డారు. మరోవైపు 14 వందలకుపైగా ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోయారు. గాజా ఎప్పుడో శిథిలనగరంగా మారింది. ఆకలిదప్పులతో అల్లాడిపోతున్న ప్రజలు నగరం వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఆరు లక్షల మందికిపైగా జనం వెళ్లిపోయారు. ఇప్పటికీ గాజాలో నివసిస్తున్న వారికి ఆహారం, నీరు, ఇంధనం అందడం లేదు. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాయపడిన వేలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్సలు ఆగిపోవడంతో చాలా మంది చనిపోతున్నారు.

విషాదమేమిటంటే మృతదేహాలను(Dead bodies) భద్రపరచడానికి ప్లాస్టిక్‌ బ్యాగులు కూడా లేకపోవడం. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌కు సాయంగా అమెరికా(America) పంపించిన అత్యాధునిక యుద్ధ విమాన వాహక నౌకలు మధ్యదరా సముద్రంలో గాజా తీరంలో మోహరించాయి. గాజా స్ట్రిప్‌పై వైమానికదాడులను ఇజ్రాయెల్‌ ఆపేస్తే బందీలను విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్‌ చెబుతోంది. అలాగే ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే, అందుకు బదులుగా తమ వద్దనున్న బందీలను విడుదల చేయాలన్న ఆలోచనలో హమాస్‌ ఉన్నదట! మరోవైపు ఇజ్రాయెల్‌-లెబనాన్‌ సరిహద్దుల్లో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

లెబనాన్‌ సరిహద్దుల్లో నివసిస్తున్న యూదులంతా వెంటనే అక్కడ్నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. లెబనాన్‌ సరిహద్దుల సమీపంలో 28 యూదు కాలనీలు ఉన్నాయి. వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్నారట! గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఎక్కువ రోజులు ఉండకూడదని జో బైడెన్‌ తెలిపారు. గాజాపై యుద్ధాన్ని మానుకోవాలని సూచించారు. యుద్ధాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, గాజా ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు జో బైడెన్‌ సూచించారు.

తమ దేశ ఉత్తర సరిహద్దుల్లో తమను పరీక్షించవద్దని ఇరాన్, హెజ్బొల్లా సంస్థను ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ హెచ్చరించారు. ఇంకోవైపు బందీలను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని హమాస్‌ మిలిటెంట్లకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటేరన్‌ సూచించారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ ఘర్షణ మరింత విస్తరించవద్దని కోరుకుంటున్నానని బ్రిటిష్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ చెప్పారు. ఘర్షణ ఆగిపోవాలని, ఇందుకోసం తన వంతు కృషి చేస్తానని, ఈ దిశగా ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి పని చేస్తానని వివరించారు.

"Written By : Senior Journalist M.Phani Kumar"

Updated On 17 Oct 2023 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story