Iran Twice Execution : రెండుసార్లు ఉరిశిక్ష! మొదటిసారి తప్పించుకున్నాడు.. రెండోసారి తప్పలేదు!
అతగాడికి ఉరితాడు మెడకు బిగుసుకుంటుందని రాసిపెట్టి ఉంది.
అతగాడికి ఉరితాడు మెడకు బిగుసుకుంటుందని రాసిపెట్టి ఉంది. హత్య కేసులో(Murder case) దోషిగా తేలిన సదరు వ్యక్తి మొదటిసారి శిక్ష నుంచి తప్పించుకున్నాడు. రెండోసారి మాత్రం ఉరి నుంచి ఎవరూ తప్పించలేకపోయారు. ఈ చిత్రమైన ఘటన ఇరాన్‌లో(Iran) జరిగింది. అహ్మద్ అలిజెదా అనే 26 ఏళ్ల యువకుడు ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత న్యాయస్థానం అతడికి ఉరిశిక్ష విధించింది(Death sentence). ఏప్రిల్ 27వ తేదీన హెజెల్ హెసర్ జైలులో ఉరిశిక్షను అమలు చేయాలని నిర్ణయించారు. దోషిని ఉరికంబం వరకు తీసుకొచ్చారు. మెడకు తాడు బిగించారు. మరికొన్ని నిమిషాల్లో ఉరికంబంపై వేలాడుతూ గిలా గిలా కొట్టుకునేవాడే! అంతలోనే ఆపండి అనే కేక గట్టిగా వినిపించింది. హత్యకు గురైన వ్యక్తి కుటుంబసభ్యులు క్షమాపణకు అంగీకరించడంతో ఉరిశిక్ష రద్దు అయ్యింది. క్షణాల వ్యవధిలో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
అయితే ప్రాణాలతో బయటపడ్డాననే ఆనందం కొన్ని రోజులకే ఆవిరయ్యింది. ఏ కుటుంబసభ్యులైతే క్షమాపణకు అంగీకరించారో, వారితో పరిహారం విషయంలో అగ్రిమెంట్ కుదరలేదు. దాంతో అహ్మద్ అలిజెదాకు మరోసారి ఉరిశిక్ష అమలు చేశారు. ఈసారి మాత్రం అదృష్టం అతడికి హ్యాండ్ ఇచ్చింది. ఉరితాడు అతడి ప్రాణాలు తీసింది.