టీ20 ప్ర‌పంచ‌క‌ప్(T20 Worldcup) నెగ్గిన భారత క్రికెట్(Team India) జట్టు బార్బడోస్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా స్వదేశానికి తిరిగి రావడం కొన్ని రోజులు ఆలస్యమైంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్(T20 Worldcup) నెగ్గిన భారత క్రికెట్(Team India) జట్టు బార్బడోస్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా స్వదేశానికి తిరిగి రావడం కొన్ని రోజులు ఆలస్యమైంది. శనివారం జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను(South africa) ఓడించి T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను భార‌త‌ జట్టు గెలుచుకుంది. అయితే.. టీమిండియా ఆదివారం భారతదేశానికి బయలుదేరాల్సి ఉంది. కానీ బెరిల్ తుఫాను కారణంగా వారు అక్కడే ఉండవలసి వచ్చింది. బార్బడోస్‌లో తుఫాన్‌ ముప్పు కారణంగా ప్రభుత్వం విమానాశ్రయాన్ని మూసివేయవలసి వచ్చింది. అలాగే అన్ని విమానాలు రద్దు అయ్యాయి.

దీంతో టీమ్ ఇండియా బుధవారం స్వదేశానికి తిరిగి రానుందని ముందుగా వెల్లడించారు. అయితే బుధవారం భారత జట్టు కాస్త ఆల‌స్యంగా బార్బడోస్‌ను వీడి రేపు భార‌త్‌కు రానున్న‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. టీమిండియా రాక‌కు కొంత‌ జాప్యం జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో ఆటగాళ్లు గురువారం ఉదయం ఢిల్లీ చేరుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

వార్తా సంస్థ PTI ప్రకారం.. భారత జట్టును పికప్ చేసుకోవడానికి వెళ్లిన‌ చార్టర్ ఫ్లైట్ ఇంకా బార్బడోస్ చేరుకోలేదు. AIC24WC (ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 వరల్డ్ కప్) పేరుతో ఎయిర్ ఇండియా ప్రత్యేక చార్టర్ ఫ్లైట్.. భారత జట్టు, సహాయక సిబ్బంది, ఆటగాళ్ల కుటుంబాలు, కొంతమంది బోర్డు అధికారులు, భారతీయ మీడియాను తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. బెరిల్ తుపాను కారణంగా వీరంతా గత మూడు రోజులుగా బార్బడోస్‌లో చిక్కుకుపోయారని పేర్కొంది. జూలై 2న USAలోని న్యూజెర్సీ నుండి చార్టర్ విమానం బయలుదేరింది, అయితే అది బార్బడోస్‌కు చేరుకుందా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. సమాచారం ప్రకారం.. ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంటలకు బార్బడోస్‌లో దిగాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అప్‌డేట్ రాలేదు. షెడ్యూల్ ప్రకారం.. ఈ విమానం బార్బడోస్ నుండి జూలై 3న స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:30 గంటలకు అంటే ఈరోజు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది. ఢిల్లీ చేరుకోవడానికి 16 గంటల సమయం పడుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6 గంటలకు టీమ్ ఇండియా ఢిల్లీలో అడుగుపెట్టనుంది. విమానం ఆలస్యం కాకపోతే మాత్రమే ఇది జరుగుతుంది.

బార్బడోస్‌లోని గ్రాంట్లీ ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. అంతకుముందు భారత జట్టు జూలై 2న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి బుధవారం రాత్రి 7.45 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చేరుకోవాల్సి ఉంది. ఆటగాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించాల్సి ఉండగా.. ఆ ఈవెంట్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.

తుఫాను కారణంగా బార్బడోస్‌లో మూడు రోజుల పాటు చిక్కుకుపోయిన ఆటగాళ్లు బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) ఢిల్లీకి వెళ్లాల్సి ఉందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మంగళవారం వెల్లడించారు. బార్బడోస్ నుంచి టీమ్ ఇండియా ఢిల్లీకి బయలుదేరినందుకు గాడ్ థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. తీవ్ర తుపాను కారణంగా మూడు రోజులుగా అక్కడే చిక్కుకుపోయారు. ఆటగాళ్లు క్షేమంగా స్వదేశానికి వెళ్లేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. బీసీసీఐ కార్యదర్శి జే షా స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఇంతలో BCCI కూడా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేపింది. చివరకు ట్రోఫీ ఇంటికి వస్తుందని వెల్లడించింది.

Eha Tv

Eha Tv

Next Story