మాల్దీవులతో కొనసాగుతున్న వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మౌనం వీడారు.

మాల్దీవుల(Maldives)తో కొనసాగుతున్న వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar) మౌనం వీడారు. ప్రతీ దేశం భారత్‌కు ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని.. భార‌త్‌ను అంగీకరిస్తుందని హామీ ఇవ్వలేమని జైశంకర్ అన్నారు. భారత్-మాల్దీవుల(India-Maldives Row) ఇటీవలి విభేదాలపై నాగ్‌పూర్‌లో జైశంకర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ప్రతి దేశం మాకు మద్దతు ఇస్తుందని నేను హామీ ఇవ్వలేనని అన్నారు. గత 10 ఏళ్లలో ప్రజలతో మనం ఏర్పరచుకున్న సంబంధాలలో గొప్ప విజయాన్ని సాధించామని.. అనేక దేశాలతో సంబంధాలు బలపడ్డాయని విదేశాంగ మంత్రి అన్నారు.

రాజకీయ సంబంధాలలో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ.. ప్రజలలో సానుకూల భావాలను పెంపొందించడంపై దృష్టి సారించి.. ప్రపంచవ్యాప్తంగా బలమైన సంబంధాలను నిర్మించేందుకు గత దశాబ్ద కాలంగా భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను జైశంకర్ వివ‌రించారు. జైశంకర్ చైనా వివాదంపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రతిష్టంభన నేప‌థ్యంలో సంబంధాలు సాధారణంగా ముందుకు సాగుతాయని చైనా(China) ఆశించకూడదని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్(lakshadweep) పర్యటనను మాల్దీవుల నాయకులు ఇటీవల ఎగతాళి చేయడంతో భారత్-మాల్దీవులు సంబంధాలు క్షీణించాయి. ఇంటర్నెట్‌(Internet)లో పలువురు లక్షద్వీప్‌లోని బీచ్‌లను మాల్దీవులతో పోల్చడంతో మాల్దీవుల మంత్రులు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది మాల్దీవులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు మల్షా షరీఫ్, మరియం షియునా, అబ్దుల్లా మహ్జూమ్ మజిద్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Updated On 15 Jan 2024 12:15 AM GMT
Yagnik

Yagnik

Next Story