MEA Advisory: ఆ దేశంలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
ప్రస్తుతం అక్కడ ఎవరైనా భారతీయులు ఉంటే తక్షణమే బయలుదేరి రావాలని..
మయన్మార్‌లో శాంతి భద్రతలు రోజు రోజుకీ క్షీణిస్తూ ఉన్నాయి. రాఖైన్ రాష్ట్రంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా అక్కడకు వెళ్లొద్దని భారత పౌరులకు కేంద్రం సూచించింది. ప్రస్తుతం అక్కడ ఎవరైనా భారతీయులు ఉంటే తక్షణమే బయలుదేరి రావాలని.. రాఖైన్‌లో హింస చెలరేగుతోన్న నేపథ్యంలో భారత్ హెచ్చరించింది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, నిత్యావసరాల కొరత సహా పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉందని.. భారతీయులకు అక్కడకు వెళ్లొద్దని విదేశాంగ శాఖ హెచ్చరించింది. మూడేళ్ల కిందట ఫిబ్రవరి 2021లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని కోరుతూ ప్రజలు నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
ఇక భారత్- మయన్మార్ సరిహద్దుల్లో కంచె నిర్మించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. మయన్మార్ నుండి భారత్‌కు అక్రమ వలసదారులు ఎక్కువ కావడంతో మొత్తం 1,643 కిమీ మేర కంచె వేసేందుకు సిద్ధమైంది. భారత్‌లోని మొత్తం నాలుగు రాష్ట్రాలతో మయన్మార్ సరిహద్దులు పంచుకుంటోంది. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా 2018లో కేంద్రం ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా కదలికల విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే మయన్మార్‌లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడడంతో ఆ దేశం నుంచి భారత్‌కు భారీ సంఖ్యలో వలసదారులు వస్తున్నారు. సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేసేందుకు భారత్-మయన్మార్ సరిహద్దుల వెంబడి కంచె వేసేందుకు కేంద్రం నిర్ణయించింది.