Hunger Deaths In India : అన్నపూర్ణ వంటి మన దేశంలో ఆకలిచావులు!
మన దేశాన్ని అన్నపూర్ణగా చెప్పుకుంటాం! పాడిపంటలతో పసిడి రాశులతో కళకళలాడే దేశంగా కీర్తించుకుంటాం!
మన దేశాన్ని అన్నపూర్ణగా చెప్పుకుంటాం! పాడిపంటలతో పసిడి రాశులతో కళకళలాడే దేశంగా కీర్తించుకుంటాం! కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. పట్టెడన్నం కోసం నిరుపేదలు ఆక్రందనలు చేస్తున్నారు. ప్రపంచ ఆకలి సూచిక (GHI)లో మనం దిగజారిపోతున్నామే తప్ప ఎగబాకడం లేదు. 2024వ సంవత్సరానికి సంబంధించి విడుదలైన 19వ జీహెచ్‌ఐలో మొత్తం 127 దేశాలలో మనం 105వ స్థానంలో ఉన్నాం. ఎంతసేపూ మనం పాకిస్తాన్‌ను, ఆఫ్గనిస్తాన్‌ను ఆడిపోసుకుంటుంటాం కానీ ఆ దేశాలు మనకంటే ముందున్నాయి. పొరుగున ఉన్న నేపాల్, శ్రీలంక, మయన్మార్‌ల కంటే మనం వెనుకబడ్డాం. గత ఏడాది 125 దేశాల్లో భారతదేశం 111వ స్థానంలో ఉండింది. అంతకు ముందు 107వ స్థానంలో నిలిచింది. ఈసారి ర్యాంకింగ్‌లో పరిస్థితి కొంత బెటరనే అనుకోవాలి. 27.3 స్కోర్‌తో తీవ్రమైన ఆకలి సమస్యలతో బాధపడుతున్న 42 దేశాలలో భారతదేశం(India) కూడా ఉండటమే ఆందోళన కలిగిస్తున్న విషయం . ఈ జాబితాలో చైనా(china), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్‌తో పాటు 22 దేశాలు మొదటి స్థానంలో నిలిచాయి. ఏ దేశంలో ఆకలి పరిస్థితి ఎలా ఉంటుందో GHI చెబుతుంది. ఒక దేశం స్కోర్ తక్కువ ఉంటే, అక్కడి ప్రజలు తక్కువ ఆకలితో ఉన్నారని అర్థం. ఈ నివేదికను ఐరిష్ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, వరల్డ్ హంగర్ హెల్ప్ సంయుక్తంగా ప్రచురించాయి. శ్రీలంక 56, నేపాల్ 68, బంగ్లాదేశ్‌లు 84వ ర్యాంక్‌తో భారత్ కంటే చాలా ముందున్నాయి. ఈ దేశాలన్నీ మెరుగైన GHI స్కోర్‌లతో మిడిల్ కేటగిరీలో ఉన్నాయి. అదే సమయంలో 109వ స్థానంలో ఉన్న పాకిస్థాన్, 116వ స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లు తీవ్రమైన కేటగిరీలో చేర్చబడ్డాయి. బెలారస్, బోస్నియా, చిలీ, చైనా, కోస్టారికా దేశాలు అగ్రస్థానం దక్కించుకున్నాయి. సోమాలియా, యెమెన్, చాద్, మడగాస్కర్, కాంగో దేశాలు చివరి అయిదు దేశాలుగా నిలిచాయి. ప్రస్తుత ఆహార సంక్షోభానికి గాజా, సూడాన్‌లలో జరిగిన యుద్ధాలే కారణమని నివేదిక చెబుతోంది. ఆఫ్రికా దేశాలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా పడినట్టు నివేదిక తెలిపింది. డొమినికన్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, హైతీ, మాలి, సిరియాతో సహా ఇతర ప్రదేశాలలో కూడా యుద్ధం, పౌర సంఘర్షణ ఆహార సంక్షోభాలకు కారణమవుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.8 బిలియన్ల మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారట! తగినంత మొత్తంలో ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రతిరోజూ 733 మిలియన్ల మంది ప్రజలు ఆకలిని ఎదుర్కొంటున్నారట! పిల్లల మరణాల విషయంలో మన భారతదేశం 2000వ సంవత్సరం నుంచి మెరుగుదల సాధిస్తూ వస్తున్నది. అయినప్పటికీ పోషకాహార లోపం తీవ్రమైన సమస్యగానే ఉండిపోతోంది. అలాగే అయిదు సంవత్సరాల లోపు చిన్నారులలో కుంగుబాటు, ఎత్తుకు తగిన బరువు లేకపోవడం అనే సమస్యలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి.