Pakistan Violence : పాక్‌లో అదుపు తప్పిన పరిస్థితి.. ఎనిమిది మంది మృతి.. 300 మందికి గాయాలు
అవినీతి ఆరోపణలపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్థాన్‌లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ఇమ్రాన్ అరెస్టు తర్వాత బుధవారం పాకిస్తాన్‌లోని అనేక నగరాల్లో హింస చెలరేగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత 24 గంటల్లో అనేక నగరాల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, భద్రతా దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో ఎనిమిది మరణించగా.. దాదాపు 300 మంది గాయపడ్డారు.
అవినీతి ఆరోపణలపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్(Imran Khan) అరెస్ట్(Arrest) తర్వాత పాకిస్థాన్(Pakistan)లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ఇమ్రాన్ అరెస్టు తర్వాత బుధవారం పాకిస్తాన్‌లోని అనేక నగరాల్లో హింస చెలరేగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత 24 గంటల్లో అనేక నగరాల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, భద్రతా దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో ఎనిమిది మరణించగా.. దాదాపు 300 మంది గాయపడ్డారు. అవినీతి కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన తర్వాత.. అతని మద్దతుదారులు పంజాబ్(Punjab)లోని 14 ప్రభుత్వ భవనాలు(Govt Buildings), సంస్థల కార్యాలయాలను తగలబెట్టారని పోలీసులు తెలిపారు. అలాగే 21 పోలీసు వాహనాల(Police Vehicles)కు నిప్పు పెట్టారని వెల్లడించారు.
ఇమ్రాన్ పార్టీ.. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) మద్దతుదారుల ఘర్షణల్లో 130 మంది అధికారులు, భద్రతా దళాల సిబ్బంది గాయపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పంజాబ్, ఖైబర్-పఖ్తున్ఖ్వా(Khyber Pakhtunkhwa), బలూచిస్థాన్(Balochistan)లలో సైన్యాన్ని మోహరించారు. రాజధాని ఇస్లామాబాద్‌లోనూ సైన్యాన్ని దించారు. లాహోర్(Lohore)లోని ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) నివాసంపై ఆందోళనకారులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 500 మందికి పైగా ఆందోళనకారులు ప్రధాని నివాసానికి చేరుకుని అక్కడ ఉంచిన వాహనాలను తగులబెట్టారు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌పై పెట్రోల్ బాంబులు విసిరి పోలీస్ బూత్(Police Booth)కు నిప్పు పెట్టారు. ఇమ్రాన్ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్దతుదారులు మంగళవారం ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. అరెస్టును ఖండిస్తూ పీటీఐ బుధవారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
"పెరుగుతున్న ఫాసిజం"కి వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలని పిటిఐ(PTI) నాయకత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసిందని.. "నిర్ణయాత్మక పోరాటానికి" సమయం ఆసన్నమైందని మద్దతుదారులతో చెప్పిందని డాన్ వార్తాపత్రిక నివేదించింది. ఇమ్రాన్ అరెస్ట్ వార్త తెలియగానే దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. అతని మద్దతుదారులు, కర్రలు, రాడ్లతో, ఇతర ఆయుధాలతో పాకిస్తాన్ సైన్యం ప్రధాన కార్యాలయంతో సహా భద్రతా సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు వ్యతిరేకంగా పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు వాషింగ్టన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నిరసనకారులు ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన న్యాయమూర్తి, ఆర్మీ జనరల్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.