Fake Bear Attack On Rolls Royce : ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషం!
ఇన్సూరెన్స్ కంపెనీలను(Insurance Company) మోసగించడానికి నలుగురు ఫ్రెండ్స్ చిత్రమైన ప్లాన్ వేశారు.
ఇన్సూరెన్స్ కంపెనీలను(Insurance Company) మోసగించడానికి నలుగురు ఫ్రెండ్స్
చిత్రమైన ప్లాన్ వేశారు. ఎలుగుబంటి వేషం( Bear costume) వేసి ఖరీదైన కార్లను(Costly cars) నాశనం చేశారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం ప్రయత్నించారు. ఎందుకో అధికారులకు డౌట్ వచ్చింది. దర్యాప్తు చేశారు. అందులో గుట్టు బయటపడింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో(California) ఈ ఏడాది జనవరి లో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. పర్వత ప్రాంతమైన లేక్ యారోహెడ్‌లో పార్క్ చేసిన లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌లోకి(Rolls royce) ఎలుగుబంటి ప్రవేశించింది. కారు లోపలి భాగాలు, సీట్లను ధ్వంసం చేసింది. ఆ తర్వాత కారు యజమాని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దరఖాస్తు చేశాడు. ఎలుగుబంటి కారులో ఉన్నట్లుగా రికార్డైన సీసీటీవీ వీడియో క్లిప్, కారు సీటును ధ్వంసం చేసిన ఫొటోలను ఆధారాలుగా సమర్పించాడు. అయితే ఇన్సూరెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వారు కాలిఫోర్నియా వైల్డ్‌లైఫ్ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించారు. ఆ వీడియోను సునిశితంగా పరిశీలించిన ఒక జీవశాస్త్రవేత్త కారులో ప్రవేశించింది నిజమైన ఎలుగుబంటి కాదని చెప్పారు. సీటుపై పడిన గోళ్ల ఆనవాళ్లు కూడా ఎలుగుబంటివి కావని తెలిపారు. అది మనిషి చేసిన పనిగా గుర్తించాడు. కాగా, అదే ప్రాంతంలో పార్క్ చేసిన మరో రెండు కార్ల ను కూడా అదే ఎలుగుబంటి ధ్వంసం చేసినట్లు వేర్వేరు బీమా కంపెనీలకు మరో రెండు క్లెయిమ్స్ అందినట్లు ఇన్సూరెన్స్ ఫ్రాడ్ అధికారులు తెలుసుకున్నారు. అదే వీడియో క్లిప్, ఫొటోలు సమర్పించినట్లు తెలుసుకున్నారు. దాంతో ఒక వ్యక్తి ఇంట్లో సోదా చేశారు. అక్కడ వారికి ఎలుగుబంటి దుస్తులు కనిపించాయి. దీంతో 1.17 కోట్ల రూపాయల బీమా మోసానికి నలుగురు స్నేహితులు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. 26 ఏళ్ల రూబెన్ తామ్రాజియన్, 39 ఏళ్ల అరరత్ చిర్కినియన్, 32 ఏళ్ల వాహే మురద్ఖాన్యన్, 39 ఏళ్ల అల్ఫియా జుకర్‌మాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.