Europe Over Tourism : ప్లీజండి... మా దేశానికి మాత్రం రాకండి...!... టూరిస్టులను వేడుకుంటున్న యూరప్ దేశాలు
ఏ దేశమైనా పర్యాటక(Tourism) రంగానికి పెద్ద పీట వేస్తుంది. టూరిస్టులతో తమ దేశం కళకళలాడాలని భావిస్తుంటుంది. పర్యాటకులను ఆకర్షించడానికి అందమైన వీడియోలను, ట్యాగ్‌లైన్‌లను వదులుతుంది. ఆర్ధిక వ్యవస్థలో పర్యాటక రంగానికి కూడా ప్రముఖ పాత్రే! పర్యాటకంతో బోల్డంత ఆదాయం సమకూరుతుంది. చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుంది.
ఏ దేశమైనా పర్యాటక(Tourism) రంగానికి పెద్ద పీట వేస్తుంది. టూరిస్టులతో తమ దేశం కళకళలాడాలని భావిస్తుంటుంది. పర్యాటకులను ఆకర్షించడానికి అందమైన వీడియోలను, ట్యాగ్‌లైన్‌లను వదులుతుంది. ఆర్ధిక వ్యవస్థలో పర్యాటక రంగానికి కూడా ప్రముఖ పాత్రే! పర్యాటకంతో బోల్డంత ఆదాయం సమకూరుతుంది. చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. అందుకే టూరిజానికి అధిక ప్రాధాన్యతనిస్తుంటాయి. యూరప్(Europe) దేశాలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. దయచేసి మా దేశానికి రాకండి అంటూ టూరిస్టులను బతిమాలుకుంటున్నాయి.
వచ్చిన వారు మళ్లీ రాకుండా ఉండేందుకు అనేక ఆంక్షలను, పన్నులను విధిస్తున్నాయి. అందుకు కారణం టూరిజం మితిమీరిపోవడమే! దేశ రాజధానుల జనాభా కంటే వచ్చే వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నెదర్లాండ్స్(Netherlands) రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌నే(Amsterdam) తీసుకుంటే ఆ నగర జనాభా ఎనిమిదిన్నర లక్షలు. ఏటా అక్కడికి వస్తున్న టూరిస్టుల సంఖ్య 2.52 కోట్లు! అలాగే స్పెయిన్(Spain) రాజధాని బార్సిలోనా(Barsi) జనాభా 16 లక్షలు. ప్రతి ఏడాది పర్యాటకుల సంఖ్య మూడు కోట్లు! ఇటలీలోని ఫ్లోరెన్స్ జనాభా 3.8 లక్షలు.
కానీ ఏటా టూరిస్టులు మాత్రం రెండు కోట్లకు పైగా వస్తుంటారు. కరోనా ప్రపంచాన్ని కుమ్ముస్తున్న సమయంలో టూరిజం బాగా దెబ్బతింది. కోవిడ్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత పర్యాటకం మళ్లీ ఊపందుకుంది. మామూలుగా కాదు.. విపరీతంగా పెరిగింది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో స్థానికులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆమ్‌స్టర్‌డామ్ వంటి చోట్లలో అయితే స్వదేశంలోనే పరాయివాళ్లుగా మారిపోతున్నామనే ఫీలింగ్ స్థానికులలో మొదలయ్యింది.
హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్పిటల్స్, థియేటర్లు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు చివరికి రోడ్లు కూడా కిక్కిరిసిపోవడంతో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. ట్రాఫిక్ బాగా పెరిగింది. వాయు కాలుష్యం పెరిగింది. సౌండ్ పొల్యూషన్‌తో చెవులకు తూట్లు పడుతున్నాయి. పరిశుభ్రత లోపించింది. చెత్త పేరుకుపోతోంది. భద్రత తగ్గింది. ఆదాయం పెరిగింది కానీ స్థానికుల జీవనమే దుర్భరంగా మారింది.
అందుకే ఇక మా నగరానికి రాకండి అంటూ ప్రాధేయపడుతున్నారు. మున్సిపాలిటీలు, కౌన్సిళ్లకు పర్యాటకాన్ని ఆపాలంటూ స్థానికుల నుంచి ఒత్తిడి మొదలయ్యింది. ఆపేస్తే ప్రభుత్వానికి వచ్చే రాబడి పోతుంది. టూరిజం కారణంగా భారీ స్థాయిలో వస్తున్న విదేశీ మారక ద్రవ్యం ఆగిపోతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు పూర్తిగా నిషేధం విధించే బదులుగా కట్టడి చేస్తే చాలనుకుంటున్నాయి.
పర్యాటకుల సంఖ్యను తగ్గించడానికి ఎంట్రీ ఫీజును వసూలు చేయడం మొదలుపెట్టాయి. చివరకు చర్చిలను సందర్శించే వారి దగ్గర కూడా ప్రవేశ రుసుము కలెక్ట్ చేస్తున్నాయి. ఇటలీలోని వెనిస్ నగరాన్ని సందర్శించాలంటే మూడు నుంచి పది యూరోలు దాకా చెల్లించాల్సి ఉంటుంది. గ్రీస్‌లోని పురాతన ఆక్రోపోలిస్‌ను చూసేందుకు వచ్చే టూరిస్టులకు టైమ్‌స్లాట్‌లు కేటాయించారు. రోజుకు 20 వేల మందికి మించి అనుమతించడం లేదు.
పర్యాటకులతో వస్తున్న భారీ నౌకలపై ఇటలీ, నెదర్లాండ్స్ నిషేధం విధించాయి. ఇంతకు ముందులా బీచ్‌లలో ఇష్టం వచ్చినంత సేపు ఉండటానికి వీల్లేదు. టైమ్ లిమిట్‌ను పెట్టారు అధికారులు. అలాగే పట్టణాల్లో కూడా టైమ్ లిమిట్‌ను విధించారు. అదనపు సమయం ఉంటే మాత్రం ఫైన్ వేస్తున్నారు. ఇటలీ ఫోర్టోఫినో బీచ్‌లో సెల్ఫీలు దిగుతూ ఎక్కువ సమయం గడుపుతున్నారు పర్యాటకులు. అందుకే వాటిని నో వెయిటింగ్ జోన్‌లుగా ప్రకటించారు.
అక్కడ ఎక్కువ సేపు నిలబడితే 275 యూరోల జరిమానా కట్టాల్సి ఉంటుంది. వెనిస్‌లోని ఎరాక్లియా బీచ్‌లో సరదాగా ఇసుక గూళ్లు కట్టారే అనుకోండి.. దాంతో పాటు 250 యూరోలు ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. టూరిస్టులను కంట్రోల్ చేయడానికి ప్రాంతాల వారిగా షెడ్యూళ్లను ప్రకటించబోతున్నది ఫ్రాన్స్. విమాన ప్రయాణాలపై టాక్స్ పెంచబోతున్నది. బీచ్ వాలీబాల్‌ను పోర్చుగల్ నిషేధించింది.
బీచ్‌లలో మ్యూజిక్ ప్లే చేయకూడదు. చేస్తే కనుక 200 యూరోల నుంచి 36 వేల యూరోల వరకు జరిమానా విధిస్తారు. క్రోయేషియాలో టూరిస్టులు బ్యాగులతో తిరగకూడదు. ఎక్కడపడితే అక్కడ తాగకూడదు. ఇంతకు ముందు వరకు అమెరికాతో పాటు 60 దేశాల ప్రజలు ఎలాంటి వీసా లేకుండా యూరప్‌కు వెళ్లవచ్చు. రాబోయే రోజుల్లో ఆ సదుపాయం ఉండదు. వచ్చే ఏడాది నుంచి అమెరికాతో పాటు ఆ 60 దేశాల నుంచి వచ్చే టూరిస్టుల నుంచి డబ్బు వసూలు చేయబోతున్నారు.