హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana assembly elections) ఫలితాల తర్వాత ఈవీఎంలపై బోల్డన్ని అనుమానాలు వచ్చాయి.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana assembly elections) ఫలితాల తర్వాత ఈవీఎంలపై బోల్డన్ని అనుమానాలు వచ్చాయి. 2014 తర్వాత దేశంలో జరిగిన చాలా ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఈవీఎంలపై(EVM) ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, అసలు ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని చెప్పుకొస్తోంది. కాకపోతే కొందరు మాత్రం ఈవీఎంలను హ్యాక్ చేయడం ఈజీ అని అంటున్నారు. టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్(Elon musk) కూడా ఇదే చెబుతున్నారు. బ్యాలెట్ పేపర్లతోనే(ballot paper) ఎన్నికలు నిర్వహించాలని ఎలన్ మస్క్ గట్టిగా చెబుతున్నారు. టెక్నాలజీపై మక్కువ ఉన్న తాను ఈ మాట అంటున్నానని మస్క్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్(donald trump) తరపున ఎలన్ మస్క్ ప్రచారం చేస్తున్నారు. రెండు రోజుల కిందట పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన బహిరంగ సభలో ఎలన్ మస్క్ ఈ కామెంట్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఎలన్ మస్క్ మొదటి నుంచే అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలలో కాలం చెల్లిన మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారని, దీంతో వీటిని హ్యాక్ చేయడం చాలా చాలా ఈజీ అని, ఒక టెక్నాలజీ నిపుణుడిగా ఈ విషయాన్ని చెబుతున్నానని నాలుగు నెలల కిందట ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. 2017లో సెనేట్ ఇంటెలిజెన్స్ విచారణలో ఈ విషయం బయటపడిందన్నారు. ఓ అభ్యర్థి గెలిచేట్టుగా ఈవీఎంలను రీ ప్రోగ్రామింగ్ చేయవచ్చని తెలిపారు. అమెరికా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సహా మరే విధంగానూ ఎల్రక్టానిక్ ఓటింగ్ పద్ధతిని వాడకూడదని మస్క్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. 'ఈవీఎంలను చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఇంకా చాలా తేలిగ్గా హ్యాక్ చేయవచ్చు. నాకు కంప్యూటర్ అంటే ఇష్టం. అయితే కంప్యూటర్లు ఓటింగ్ ట్యాబ్‌లేషన్‌ను కలిగి ఉండకూడదు. ఈవీఎంల్లో వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉత్తమమైనది కాదు. ఎన్నికల్లో పేపరు బ్యాలెట్లు మాత్రమే ఉపయోగించాలి. ప్రతి వ్యక్తి నేరుగా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి లైన్‌లో నిలబడి ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలి’ అని మస్క్ తెలిపారు.