China Dragon Boat Festival : చైనాలో డ్రాగన్ బోట్ రేసు! ఈ పడవ పందాల ప్రత్యేకత ఏమిటి?
ఇవాళ చైనాలో(china) చూడచక్కని ఓ బోటు రేసు(Boat race) జరుగుతోంది. పోటీలో పాల్గొన్న పడవలను డ్రాగన్‌లా(Dragon) తీర్చిదిద్దారు. రంగులతో అలంకరించారు. పడవ పందాలు సాగుతున్నంతసేపూ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇంతకీ డ్రాగన్ బోట్ రేసు స్పెషాలిటీ ఏమిటి..? ఎందుకోసం వీటిని నిర్వహిస్తారు..?
ఇవాళ చైనాలో(china) చూడచక్కని ఓ బోటు రేసు(Boat race) జరుగుతోంది. పోటీలో పాల్గొన్న పడవలను డ్రాగన్‌లా(Dragon) తీర్చిదిద్దారు. రంగులతో అలంకరించారు. పడవ పందాలు సాగుతున్నంతసేపూ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇంతకీ డ్రాగన్ బోట్ రేసు స్పెషాలిటీ ఏమిటి..? ఎందుకోసం వీటిని నిర్వహిస్తారు..?
సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. కష్టాలను ఇష్టాలుగా మార్చుకునే చైనాలో మాత్రం చాలా సులువు. రెండువేల సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న డ్రాగన్ బోట్ రేసే ఇందుకు నిదర్శనం. పడవ పందాలే కదా అని తేలిగ్గా కొట్టిపారేయకండి. ఈ బోటు రేసుకో చరిత్రగాధ ఉంది. ఆ సంబరాల వెనుక ఓ కన్నీటి వ్యథ ఉంది.
సాధారణంగా ఈ పడవ పందాలు జూన్(June) మొదటివారంలో జరుగుతాయి.. ఈ ఏడాది జూన్ 10వ తేదీతో ప్రారంభమయ్యాయి. ఈ బోటు రేసులు ఎప్పటిలాగే వైభవోపేతంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయస్థాయిలో ఎంతో ప్రఖ్యాతి గడించిన ఈ డ్రాగన్ బోటు కార్నివాల్‌ను ప్రత్యక్షంగా తిలకించడం కోసం ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా లక్షలాది మంది పర్యాటకులు వెళ్లారు. డ్రాగన్ బోట్ రేసు అని ఎందుకంటారంటే పడవలన్నీ డ్రాగన్ ఆకారంలో ఉండటం వల్ల! ఇందులో ఎక్స్‌పర్ట్స్ మాత్రమే పాల్గొంటారు. పోటీలో పాల్గొనేవారికి ముందుగానే శిక్షణ ఇస్తారు.
స్టీర్స్‌మాన్‌లు పడవ వెనుక భాగంలో కూర్చుంటారు. డ్రమ్మర్లు ముందు భాగాన కూర్చుంటారు. పాడ్లర్లు పడవను ఫినిషింగ్ లైన్ వరకు తీసుకెళతారు. ఫీర్స్ లుకింగ్ డ్రాగన్ బోట్ రేసింగ్ అనేది అన్నిటికంటే టాప్ అన్నమాట! ఉత్తినే బోటు రేసు జరిగితే మజా ఏముంటుంది..? అందుకే చెవులు దద్దరిల్లిపోయే వాయిద్యాల ఘోష నడుమ ... సాంస్కృతిక కార్యక్రమాల మధ్య రేసులు సాగిపోతుంటాయి. కొన్ని పొడవాటి పడవలకు మీద డ్రాగన్ తలను, చివరన తోక ను అతికించి అందంగా అలంకరిస్తారు. ఈ పడవ నదిలో దూసుకుపోతుంటే అచ్చం డ్రాగన్ వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌ను టూయెన్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఒకానొకప్పుడు క్యూయువాన్ అనే కవి ఉండేవాడు. ఆయన ఆనాటి పాలకుల అవినీతిని నిరసిస్తూ మీలూ అనే నదిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది క్రీస్తుపూర్వం 278 ముచ్చట! చైనా వాసులు ఇప్పటికీ ఆ దుస్సంఘటనను తల్చుకుని కన్నీరుపెడతారు. క్యూయువాన్‌కు నివాళిగా మీలూ నదిలో మునకలేస్తారు. ఈత రాని వారు నదిలో తమ చేతులను ముంచి ప్రణమిల్లుతారు.
చైనాలో జరిగే అతి పెద్ద వేడుకల్లో డ్రాగన్ బోట్ రేసు కూడా ఒకటి! తైవాన్, హాంకాంగ్‌లలో కూడా పడవ పందాలు జరుగుతాయి.
సింగపూర్, మలేషియాలో కూడా ఈ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహిస్తారు. రకరకాల ఆకారాల్లోని డ్రాగన్ పడవలు ఈ రేసులో పాల్గొంటాయి. వీటిని తిలకించడానికి సందర్శకులు కూడా భారీగానే వస్తారు.. కొన్నేళ్ల కిందట కలపతో తయారుచేసిన భారీ డ్రాగన్ బోటు చాలా మందిని ఆకర్షించింది. దాదాపు 78 మీటర్ల పొడవున్న ఈ బోటును షిబింగ్ నదిలో చేర్చడానికి 16 వందల మంది కష్టపడాల్సి వచ్చిందంటే ఈ బోటు గొప్పతనమేమిటో అర్థమవుతుంది.. కలపతో చేసిన అతి పెద్ద డ్రాగన్ బోటు ఇదే కాబట్టి గిన్నిస్ రికార్డును కూడా సంపాదించింది. ఈ పడవల పోటీని నీటి దేవుడికి అంకితమిస్తారు నిర్వాహకులు.. రేసు ముగిసిన తర్వాత చీకట్లు ముసురుకోగానే బాణాసంచా వెలుగులతో ఆ ప్రాంతమంతా తళుకులీనుతుంది. సంప్రదాయ డ్రాగన్ నృత్యాలతో సందడి నెలకొంటుంది. ప్రతి ఏడాది వేడుకల తేదీ మారుతుంటుంది.. చైనా క్యాలెండర్ ప్రకారం అయిదో నెల అయిదో రోజున పడవ పందాలు జరుగుతాయి. ఆ రోజున చైనాలో పబ్లిక్ హాలిడే!ఆ రోజు మొత్తాన్ని బోటు రేసుకే కేటాయిస్తారు ప్రజలు. ఈ వేడుకలకు యునెస్కో గుర్తింపు కూడా ఉంది. స్థానిక ప్రజలు ఇప్పటికీ క్యూ యువాన్ మృతదేహం కోసం నదిలో వెతుకుతుంటారు. చేపలకు ఇష్టమైన ఆహారాన్ని నదిలో వదులుతారు.. ఇలా చేయడం వల్ల క్యూయువాన్ మృతదేహాన్ని చేపలు పాడు చేయవట! ఉదయం బియ్యంతో చేసిన జోంగ్జి అనే వంటకాన్ని భుజిస్తారు.. ఉత్సవానికి ముందు రోజు రాత్రే ఈ వంటకాన్ని తయారు చేసి పెట్టుకుంటారు. జోంగ్జిని తింటే ఎలాంటి వ్యాధులు సోకవన్నది వారి నమ్మకం.