One in a million:వైద్య రంగంలో అరుదైన ఘటన.. ఓ మహిళకు రెండు గర్భాశయాలు.. రెండింటి ద్వారా గర్భం
వైద్య రంగ చరిత్రలోనే ఇదొక ఆశ్చర్యకరమైన ఘటన. ఓ మహిళకు రెండు గర్భాశయాలు ఉన్నాయి. రెండు గర్భాశయాలు ఉండడమే వింత అయితే..
వైద్య రంగ చరిత్రలోనే ఇదొక ఆశ్చర్యకరమైన ఘటన. ఓ మహిళకు రెండు గర్భాశయాలు ఉన్నాయి. రెండు గర్భాశయాలు ఉండడమే వింత అయితే.. రెండింటి ద్వారానూ పిల్లల్ని కనడం మరో వింత. చైనాలోని ఓ మహిళకు సెప్టెంబర్‌లో జరిగిందీ ఘటన. వాయువ్య చైనా(China)లోని షాంగ్జి ప్రావిన్స్(Shaanxi Province)కు చెందిన మహిళ సెప్టెంబర్‌లో సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక బాబు, పాప ఉన్నారు. సాధారణంగా కవలలు కనడం పెద్ద విషయం కాకపోవచ్చు కానీ.. ఆమెకు రెండు గర్భాశయాలు ఉండడం, ఒకేసారి రెండింటి ద్వారానూ ఆమె గర్భం దాల్చడం, ఒకేసారి కవలలకు జన్మనివ్వడం వైద్య రంగంలో అత్యంత అరుదని వైద్యులు చెప్తున్నారు. జనాభాలో ఇలా 0.3 శాతం మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు. ఆ మహిళ పుట్టుకతోనే రెండు గర్భాశయాలు ఉన్నాయని, రెండూ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాయని గుర్తించారు. నేచురల్‌గా ఒకేసారి రెండు గర్భాశయాల ద్వారా ఆమె గర్భం దాల్చడం చాలా చాలా అరుదని, ఇప్పటి వరకు ఇలాంటివి రెండే రెండు సంఘటనలు జరిగాయని తెలిపారు. చైనా దేశంలో అయితే ఇదే తొలిసారి జరిగిందని చెప్పారు. ఎనిమిదిన్నర మాసాల గర్భంతో ఉండగా ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని, బాబు 3.3 కేజీలు, పాప 2.4 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉన్నారని, నాలుగు రోజుల తర్వాత ఆస్పత్రి డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు.