China Employee Lawsuit : ఆఫీసులో నిద్రపోతే ఉద్యోగంలోంచి తీసేస్తారా? 41 లక్షలు పరిహారం ఇవ్వండి!
చిన్నపాటి కునుకుకే(Nap) ఉద్యోగంలోంచి తీసేస్తారా? ఇదేం అన్యాయం?
చిన్నపాటి కునుకుకే(Nap) ఉద్యోగంలోంచి తీసేస్తారా? ఇదేం అన్యాయం? అని ఓ వ్యక్తి కంపెనీపై కోర్టులో(Court) కేసు వేశాడు. న్యాయస్థానం కూడా అతగాడి వేదనను అర్థం చేసుకుంది. సదరు కంపెనీపై అక్షింతలు వేసింది. మూడున్నర లక్షల యువాన్స్‌ను చెల్లించాలని ఆదేశించింది. ఇది ఘటన చైనాలోని(China) జియాంగ్స్ ప్రావిన్స్‌లోని(Jianx Province) తైక్సింగ్‌లో చోటు చేసుకుంది. జాంగ్ అనే వ్యక్తి సుమారు 20 సంవత్సరాల నుంచి ఓ కెమికల్ కంపెనీలో(chemical company) డిపార్ట్‌మెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఓ రోజు అతడి పనిని అర్థరాత్రి వరకు పొడిగించారు. పాపం అన్నేసి గంటలు పని చేయడం వల్ల కొన్ని నిమిషాల పాటు కళ్లు మూతలు పడ్డాయి. ఇది సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఠాట్.. కంపెనీలో నిద్రపోవడమేమిటని హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ మండిపడింది. జీరో టాలరెన్స్ డిసిప్లిన్ విధానాన్ని జాంగ్ ఉల్లంఘించాడని చెబుతూ ఉద్యోగంలోకి తీసేసింది. అలా ఎలా తనను ఉద్యోగంలోంచి తీసేస్తారని, ఇది చాలా అన్యాయమని జాంగ్ భావించాడు. కంపెనీపై చట్టపరమైన చర్య తీసుకోవాలని డిసైడయ్యాడు. కోర్టుకు వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు. ఇన్నేళ్ల సర్వీసులో తాను నిద్రపోవడం అదే మొదటిసారని, అంతే కాకుండా.. తాను నిద్రపోవడం వల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం జరగలేదు అని కోర్టుకు చెప్పుకున్నాడు. రెండు దశాబ్దాల పాటు జాంగ్ కంపెనీకి అందించిన సేవ, ఆయన పొందిన ప్రమోషన్స్, జీతాల పెరుగుదల వంటి వాటిని పరిశీలించిన కోర్టు ఓ నిర్ణయానికి వచ్చింది. జాంగ్‌ను ఉద్యోగంలోకి తొలగించడం అన్యాయమని భావిస్తూ పరిహారంగా మన కరెన్సీలో 41.6 లక్షల రూపాయలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.