American Snake Man : 172 సార్లు పాముకాటుకు గురయ్యాడు. ... వందేళ్లు నిక్షేపంగా బతికాడు!
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో వికాస్ దూబే(Vikas dube) అనే ఓ వ్యక్తిని ప్రతి శనివారం పాము కాటేస్తోంది. 40 రోజులలో ఇప్పటికే ఏడుసార్లు పాము(snake) అతడిని కరిచింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో వికాస్ దూబే(Vikas dube) అనే ఓ వ్యక్తిని ప్రతి శనివారం పాము కాటేస్తోంది. 40 రోజులలో ఇప్పటికే ఏడుసార్లు పాము(snake) అతడిని కరిచింది. కానీ అమెరికాలో(America) ఉన్న ఓ వ్యక్తి 172 సార్లు అత్యంత విషపూరితమైన పాము కాటుకు గురయ్యాడు. 20 సార్లు చచ్చి బతికాడు. అన్నేసి పార్లు పాము కాటేసినా అతడు మాత్రం నిండు నూరేళ్లు హాయిగా బతికాడు. 2011లో వందేళ్ల వయసులో చనిపోయాడు. స్నేక్‌మ్యాన్‌గా(snake man) ప్రసిద్ధుడైన ఇతడి పేరు బిల్ హాస్ట్(Bill Haast). పదే పదే పాములతో కాటేయించుకోవడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుందని అనుకున్నాడు. చిన్నప్పటి నుంచే పాములతో కరిపించుకున్నాడు. మొదట పాములను చంపిన అతడు తర్వాత పాముల కోసం ఫ్లోరిడాలో మయామి సెర్పెంటారియంను నిర్మించాడు. అందులో అనేక జాతుల పాములు ఉండేవి. అవన్నీ విషపూరితమైనవే! అక్కడికి వచ్చే వారి కోసం బిల్ హాస్ట్ ప్రదర్శనలు ఇచ్చేవాడు. పాముకాటుకు విరుగుడు మందు తయారు చేయడం అతడి వ్యాపారం. ఔషధాలను తయారు చేయడానికి ముడి విషాన్ని ఉత్పత్తి చేసేవాడు. 1990 నాటికి అతడు ప్రతి ఏడాది 36 వేల విషం నమూనాలను ఫార్మాస్యూటికల్ లాబొరేటరీలకు అందించాడు. పది వేలకు పైగా పాములు అతడి దగ్గర ఉండేవి. సముద్ర, ఆఫ్రికన్, కాటన్‌మౌత్, గిలక్కాయలు, నాగుపాములు, క్రైట్స్, గ్రీన్ మాంబాలు, టైగర్ పాములు, వైపర్ ఇలా అనేక ఇతర విషపూరిత జాతులు ఉండేవి. ప్రాణాంతకమైన పాములను ఒట్టి చేతులతో పట్టుకుని వాటి దవడలు విప్పేవాడు. వాటి పదునైన దంతాలు రబ్బరు పొరలోకి చొచ్చుకుపోతాయి. దీంతో పాములోని విషం గాజు సీసాలోకి వస్తాయి. యాంటీవీనమ్‌ను(Anti venom) తయారు చేయడానికి తగినంత విషాన్ని తయారు చేయడానికి ఈ ప్రక్రియ వేలసార్లు చేయాల్సి వచ్చింది. ఈ పని చేస్తున్నప్పుడు అనేక సార్లు పాము కాటుకు గురయ్యాడు. కొన్నిసార్లు చావుకు దగ్గరగా వెళ్లి వచ్చాడు. దీన్నుంచి తప్పించుకోవడానికి తనకు తానుగా చిన్న మొత్తాలతో నాగుపాము విషాన్ని ఇంజెక్ట్ చేసుకోసాగాడు. అలా అతని శరీరం యాంటీ-వెనమ్ రోగనిరోధక శక్తిని తెచ్చుకుంది. ఈ డోసును నెమ్మదిగా పెంచాడు. అందుకే పాము కాటు చాలా వరకు అతడిని ఏమీ చేయలేకపోయింది. 1954లో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన నీలిరంగు క్రైట్ అతడిని కాటేసింది. అతను తృటిలో చావు నుంచి తప్పించుకున్నాడు. చిత్రమేమిటంటే పది రోజుల తర్వాత ఆ పాము చనిపోవడం. నిజానికి ఈ పాము కాటేస్తే బతకడం అసంభవం. కాలక్రమంలో బిల్‌హోస్ట్ రక్తం పాము కాటుకు నివారణగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 20 మంది ప్రాణాలను ఇతడి రక్తం కాపాడింది. బిల్ హాస్ట్ అసలు పేరు విలియం ఎడ్వర్డ్ హాస్ట్.. 1910 డిసెంబర్ 30వ తేదీన న్యూజెర్సీలోని ప్యాటర్సన్ లో పుట్టాడు. ఏడేళ్ల వయసులో మొదటిసారిగా పామును పట్టుకున్నాడు. హైస్కూల్‌లో ఉన్నప్పుడే చదువు మానేశాడు. పాములను పట్టుకునే పనిలో పడ్డాడు. పాన్ అమెరికన్ ఎయిర్ వేస్ లో మెకానిక్, ఫ్లైట్ ఇంజనీర్ గా కూడా పనిచేశాడు. వయసు మీదపడిన తర్వాత కూడా హాస్ట్ 32 బల్లులు, పాముల విషం మిశ్రమాన్ని తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు.