Ayatollah Ali Khamenei : ఇజ్రాయెల్‌పై యుద్ధానికి సన్నద్ధమైన ఇరాన్.. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక
ఎవరెంత చెప్పినా వినిపించుకోని ఇజ్రాయెల్(Israel) గాజాపై(Gaza) దాడులు చేస్తూనే ఉంది. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. మరణించిన వారిలో ఎక్కువ మంది పసిపిల్లలే ఉండటం విషాదం. ఇజ్రాయెల్ చేస్తున్న అరాచకాలకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది ఇరాన్(Iran). ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై దాడికి దిగే అవకాశం ఉందనే వార్త ఇజ్రాయెల్‌ను కలవరపరుస్తోంది.

Ayatollah Ali Khamenei
ఎవరెంత చెప్పినా వినిపించుకోని ఇజ్రాయెల్(Israel) గాజాపై(Gaza) దాడులు చేస్తూనే ఉంది. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. మరణించిన వారిలో ఎక్కువ మంది పసిపిల్లలే ఉండటం విషాదం. ఇజ్రాయెల్ చేస్తున్న అరాచకాలకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది ఇరాన్(Iran). ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై దాడికి దిగే అవకాశం ఉందనే వార్త ఇజ్రాయెల్‌ను కలవరపరుస్తోంది. అమెరికా కూడా ఇజ్రాయెల్‌ను హెచ్చరించడంతో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌ను శిక్షించే సమయం వచ్చిందని ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఐ(IRNI) పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. దాడి ఎలా చేయాలన్న విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆ వార్త సంస్థ చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీన సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వాయుసేన దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్ మిలటరీ జనరల్‌తో పాటు ఆరుగురు అధికారులు మరణించారు. ఫలితంగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ కసి పెంచుకుంది. ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పి తీరతామని ఇరాన్ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖొమేనీ(Ayatollah Ali Khamenei) హెచ్చరించారు. సైనిక జనరల్స్ కూడా ఇజ్రాయెల్‌ను శిక్షించి తీరతామని ప్రకటిస్తూ ఉన్నారు. యుద్ధానికి సర్వసన్నద్ధమైన ఇరాన్ సమయం కోసం వేచి చూస్తోంది. అయితే ఇజ్రాయెల్‌పై ఇరాన్ నేరుగా దాడి చేయకపోవచ్చు. లెబనాన్ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్‌బొల్లా, ఇతర మిలిటెంట్ సంస్థలతో దాడులు చేయించవచ్చు. యుద్ధం ఎప్పుడైనా రావచ్చనే సంకేతాలు వెలువడటంతో టెహ్రాన్‌కు ఈ నెల 13వ తేదీ వరకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు జర్మనీ ఎయిర్‌లైన్స్ లుఫ్తాన్సా ప్రకటించింది. రష్యా కూడా తమ దేశ ప్రజలను అలెర్ట్ చేసింది. ఇజ్రాయెల్, లెబనాన్, పాలస్తీనా వంటి పశ్చిమాసియా దేశాలకు వెళ్లకూడదని సూచించింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌కు తాము అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Bidden) చెప్పారు. ఇజ్రాయెల్‌తో యుద్ధంలో అమెరికా భాగస్వామ్యమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.
