Death Secretes : చావు చివరి దశ కాదు.. మరణం తర్వాత చాలా ఉంది!
మరణం(Death) ఓ అశనిపాతం. అసంకల్పితం. అనివార్యం. ఆవశ్యకం.
మరణం(Death) ఓ అశనిపాతం. అసంకల్పితం. అనివార్యం. ఆవశ్యకం. కానీ అది ఓ అంతులేని దు:ఖం. ఒక్కోసారి అనిర్వచనీయమైన ఆనందం. కొండంత ధైర్యం. ముందు వెనక తేడాతో సృష్టిలో ప్రతి ఒక్క జీవికి తప్పని అనుభవమిది. తప్పించుకోలేని అనుభూతి ఇది. మరణం వరించి వస్తే ఎదురెళ్లి స్వాగతం పలకాలే కానీ. పారిపోవడానికి వీలుండదు. అది ధర్మం. సమవర్తి ఆదేశం. ఎవరైనా పాటించాల్సిందే.
అయినా మనిషి మాత్రం చావును జయించే ప్రయత్నం చేస్తున్నాడు. చావు వెనుక వున్న రహస్యాలను ఛేదించే పనిలో పడ్డాడు. మృత్యుంజయుడవ్వాలని ఉవ్విళూరుతున్నాడు. అసలు మరణం అంటే ఏమిటీ. మరణం ముందు ఏం జరుగుతుంది...మరణం తర్వాత ఏం మిగులుతుంది?
అసలు జీవం ఎప్పుడు మొదలవుతుంది? జీవి భూమ్మీద పుట్టగానే పుట్టుక మొదలవుతుందా? లేకపోతే తల్లి కడుపున పిండం జీవం పోసుకోగానే పుట్టుక మొదలయ్యినట్టా? మరణం అంటే ఏమిటీ? మనిషి చనిపోయిన తర్వాత ఏమైనా మిగులుతుందా? మిగులుతుందని కొందరు.
ఏమీ మిగలదని ఇంకొందరు వాదించుకుంటూనే వున్నారు. ఇప్పటికీ తెలుసుకోలేని రహస్యమిది. మనిషి పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచ భూతాల సమ్మేళనం. మరణించాక ఏ భూతం ఆ భూతంలో కలిసిపోతుంది. మరణం తరవాత మరేమీ మిగలదు. దహనంతోనో, ఖననంతోనో అంతా ముగిసిపోతుంది. తెలివైన వాడైనా, తెలివి లేని వాడైనా, అమీరైనా, గరీబైనా, మహాత్ముడైనా మామూలు మనిషైనా ఒకే విధంగా అంతరించిపోతారు. అందరికీ మరణమే గమ్యం.
అయితే అమెరికా శాస్త్రవేత్తలు(America scientist) మాత్రం పుట్టుక, మరణం కాకుండా మూడో దశ కూడా ఉంటుందంటున్నారు. ఇప్పటి వరకు ఏ జీవికైనా పుట్టుక, మరణం అనే రెండు దశలే ఉంటాయని అనుకున్నాం. కానీ మూడో దశ కూడా ఉన్నదని పరిశోధకులు చెబుతున్నారు. అసలు చావంటే ఏమిటి? ఊపిరి, హృదయ స్పందనలు ఆగిపోవడం. అయితే మరణించిన తర్వాత కూడా కొన్ని అవయవాలు పని చేస్తూనే ఉంటాయి. అవయవదానం అందుకే వీలుపడుతుంది.
చనిపోయాక కూడా అవయవాలు(Organs) ఎలా పనిచేయగలుగుతున్నాయి? ఇదే సందేహం పరిశోధకులకు వచ్చింది. జీవి మరణం తర్వాత కూడా అవయవాల్లోని కొన్ని కణాలు పని చేయడమే దీనికి కారణంగా గుర్తించారు. జీవం, మరణానికి మధ్యనున్న దీన్ని భిన్నమైన మూడో దశగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
మరణించిన జీవి శరీరంలోని ఓ అవయవం నుంచి తీసుకున్న కణాలు. ఒక మల్టీసెల్యూలర్‌గా ఏర్పడి మళ్లీ జీవం పోసుకోవడానికి అవకాశం ఉన్నదని ఈ ప్రయోగం ద్వారా పరిశోధకులు ఓ అవగాహనకు వచ్చారు. అదే జరిగితే, ఒకే జీవికి సంబంధించి జననం-మరణం-పునఃజననం అనే చక్రం సాధ్యమయ్యే అవకాశమున్నట్టు తెలిపారు.
మనిషి చనిపోయాక కూడా ఆ కణాలు ఎలా పని చేస్తున్నాయి? వాటిని ప్రేరేపిస్తున్నదేమిటి? చాన్నాళ్లుగా మనిషికి కలుగుతున్న సందేహాలే అయినప్పటికీ ఈ విషయాన్ని లోతుగా పరిశోధించాలనుకున్నారు శాస్త్రవేత్తలు. ఆ పరిశోధనలో గొప్ప విషయాన్ని కనుగొన్నారు. మనిషి చనిపోయినప్పటికీ సరైన పరిస్థితుల్లో కణాలను భద్రపరిచినప్పుడు అవి తిరిగి జీవాన్ని పోసుకుంటాయని కనిపెట్టారు.
ఈ కణాలకు పోషకాలు, ఆక్సిజన్ అందించినప్పుడు అవి మల్టిసెల్యూలర్ వ్యవస్థగా ఎదుగుతాయని, జీవ క్రియలను కూడా కొనసాగించగలవని తెలుసుకున్నారు. మూలకణాల నుంచి జీవులను సృష్టించడం ఇదే తరహా విధానమని గుర్తు చేశారు. అంతేకాదు.
జీవి మరణించినప్పటికీ ప్రాణంతో ఉండే కణాలు గతంలో తమ సజీవ శరీరంలో ఉన్నప్పుడు చేయలేని కొత్త పనులను కూడా చేయగలవని, వాటి ఆకారంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉన్నదనే అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు.
శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను ముందుగా కప్పపై ప్రయోగించి చూశారు.
చనిపోయిన కప్ప చర్మ కణాలను తీసి ఓ ల్యాబ్‌లో ప్రత్యేక పరిస్థితుల్లో భద్రపరిచారు. ఆ కణాలు జెనోబాట్స్ అనే బహుళ కణ జీవిగా రూపాంతరం చెందడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అయితే, కొత్తగా ఏర్పడిన జీవి గతంలో కంటే భిన్నంగా ప్రవర్తించడాన్ని వారు గుర్తించారు. అంటే, కప్ప సజీవంగా ఉన్నప్పుడు స్రవాలను పంప్ చేయడానికి ఉపయోగపడ్డ సిలియా.. జెనోబాట్‌గా మారాక ముందుకు కదలడానికి సాయపడ్డట్టు గమనించారు.
ఇక, మరణించిన మనిషి ఊపిరితిత్తుల్లోని కొన్ని కణాలను ప్రత్యేక పరిస్థితుల్లో భద్రపరిస్తే.. అవి సొంతంగా ఒక సూక్ష్మ రూపాన్ని సంతరించుకుని దానికదిగా పనిచేసుకొనేంత శక్తిని సంతరించుకొన్నదని చెబుతున్నారు. పరిశోధకులు కొత్తగా కనిపెట్టిన మూడో దశతో మరణ రహస్యం వీడిపోతున్నది.