Nuclear Gravity Bomb : హిరోషిమా కంటే 24 రెట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేస్తున్న అమెరికా
జపాన్(Japan)లోని హిరోషిమా(Hiroshima), నాగసాకీ(Nagasaki)లపై అమెరికా విసిరిన అణుబాంబు ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. మానవాళిని భయభ్రాంతులను చేసిన ఆ అణుబాంబు కారణంగా లక్షలాది మంది చనిపోయారు. రెండు మూడు తరాలు తీవ్రంగా నష్టపోయాయి.
జపాన్(Japan)లోని హిరోషిమా(Hiroshima), నాగసాకీ(Nagasaki)లపై అమెరికా విసిరిన అణుబాంబు ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. మానవాళిని భయభ్రాంతులను చేసిన ఆ అణుబాంబు కారణంగా లక్షలాది మంది చనిపోయారు. రెండు మూడు తరాలు తీవ్రంగా నష్టపోయాయి. యుద్ధ పిపాసి అమెరికా ఇప్పటికీ పశ్చాత్తాపం చెందకపోగా అత్యాధునిక ఆయుధాలను ఉత్పత్తి చేస్తూ సొమ్ము గడిస్తోంది. ఏడాదిన్నరగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ మధ్య మొదలైన భీకర పోరు, చైనా-తైవాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు .. ఇవన్నీ అమెరికాకు ప్రియమైన వార్తలు. ఎందుకంటే యుద్ధం వస్తేనే కదా అమెరికాకు లాభసాటి బేరాలు తగిలేది! ఇప్పుడు జరుగుతున్న నష్టం చాలదన్నట్టు దేశాల మధ్య అణ్వాయుధ పోటీ మరింత పెంచే దిశగా అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. అత్యంత శక్తివంతమైన సూపర్ అణుబాంబును తయారు చేయబోతున్నది. ఈ విషయాన్ని అమెరికానే స్వయంగా ప్రకటించింది. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే ఏకంగా 24 రెట్లు శక్తిమంతంగా ఉండే బాంబును తయారు చేస్తున్నది. హిరోషిమాపై వేసిన అణుబాంబు 15 కిలో టన్నుల శక్తిని, నాగసాకిపై పడ్డ బాంబు 23 కిలో టన్నుల శక్తిని విడుదల చేశాయి. ఇప్పుడు తయారు చేయనున్న అణుబాంబు ఏకంగా 360 కిలో టన్నుల శక్తిని విడుదల చేస్తుందని చెబుతున్నారు. బి61 న్యూక్లియర్ గ్రావిటీ బాంబును ఆధునీకరించి రూపొందిస్తున్న ఈ బాంబును బి61–13గా పిలుస్తున్నారు. దీని తయారీకి అమెరికా కాంగ్రెస్ అనుమతి లభించాల్సి ఉంది. అంతేగాక తమ అమ్ములపొదిలో ఉన్న అణ్వాయుధాలను 2030 కల్లా 1,000కి పెంచనున్నట్టు కూడా అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ లెక్కన మూడో ప్రపంచయుద్ధం అంటూ వస్తే ఇక ప్రపంచంలో పిట్ట పురుగు కూడా బతకదన్నమాట!