Standford University : 105 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న బామ్మ
చదువుకోవాలన్న సంకల్పం ఉండాలే కానీ దానికి వయసు అడ్డురాదు. కొంతమందికే ఆ ఆసక్తి, అభిరుచి ఉంటాయి.
చదువుకోవాలన్న సంకల్పం ఉండాలే కానీ దానికి వయసు అడ్డురాదు. కొంతమందికే ఆ ఆసక్తి, అభిరుచి ఉంటాయి. చాలా మంది పెళ్లికి ముందు వదిలేసిన డిగ్రీనో, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కంప్లీట్ చేయడానికి నిరాసక్తత చూపుతారు. ఇప్పుడు డిగ్రీలు తెచ్చుకుని చేసేది మాత్రం ఏముంది కనక అని అనుకుంటారు. కానీ ఇలాంటి వారి పూర్తి భిన్నం ఈ బామ్మగారు. 105 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకుని పలువురికి మార్గదర్శకంగా నిలిచింది. 83 ఏళ్ల క్రితం వదిలిపెట్టిన స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (GSE) మాస్టర్స్ డిగ్రీని(Master degree) తాజాగా 105 ఏళ్ల వయసులో అందుకుంది. దీని కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నానంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. 1940లలో స్టాన్‌ఫోర్డ్‌లో అవసరమైన తరగతులను పూర్తి చేసింది వర్జీనియా . మాస్టర్స్ థీసిస్‌లో ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. అదే సమయంలో ప్రియుడు జార్జ్ హిస్లోప్‌ను పెళ్లిచేసుకుంది. అతడు యుద్ధంలో పని చేయడానికి వెళ్లిపోవడంతో వర్జీనియా చదువును వదిలిపెట్టాల్సి వచ్చింది. కాలక్రమంలో ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం నలుగురు మనుమలు, తొమ్మిది మంది మనవరాళ్లతో హాయిగా ఉంటోంది. వాషింగ్టన్ స్టేట్‌లోని పాఠశాల, కళాశాల బోర్డులలో ఆమె కొన్నేళ్ల పాటు పనిచేశారు. కానీ డిగ్రీ పట్టా అందుకోవాలన్న ఆమె బలమైన కోరిక ఆమెను కుదురుగా వుండనివ్వలేదు. పట్టుదలతో చదివారు. జూన్ 16వ తేదీ ఆదివారం తన మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ని దక్కించుకుంది. బంధుమిత్రుల సమక్షంలో ఆమె పట్టాను అందుకున్నారు.