PakistanNews: భూకంపం అనుకుని బిల్డింగ్ మీద నుంచి దూకిన విద్యార్థులు
రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా రోడ్డు రోలర్ నుంచి వస్తున్న శబ్దాలు పిల్లలకు భూప్రకంపనల చప్పుళ్లు గా అనిపించాయి.

రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా రోడ్డు రోలర్ నుంచి వస్తున్న శబ్దాలు పిల్లలకు భూప్రకంపనల చప్పుళ్లు గా అనిపించాయి. ఆ భయం తో వారు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. స్కూల్ బిల్డింగ్ కూలిపోతుందన్న భయంతో మొదటి అంతస్తు నుంచి దూకారు. తీవ్రంగా గాయపడి మృత్యువు తో పోరాడుతున్నారు. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్సులోని జహానియన్, ఖనేవాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. క్లాస్ రూంలో ఉన్న కొందరు విద్యార్థులు శబ్దాలతోపాటు ప్రకంపనలు గుర్తించారు. అది భూకంపమేనని భ్రమపడ్డారు . సహ విద్యార్థులకు విషయం చెప్పారు. భయపడిన విద్యార్థులు కొందరు మెట్ల మార్గం నుంచి కిందికి వెళ్లిపోయారు. 8 మంది విద్యార్థులు మొదటి అంతస్తు కిటికీల నుంచి కిందికి దూకేశారు. తీవ్రంగా గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్కూలు దగ్గర జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగించిన రోడ్డు రోలర్ కారణంగా వచ్చిన ప్రకంపనలు, చప్పుడును విద్యార్థులు తప్పుగా అర్థం చేసుకున్నారని అధికారులు అంటున్నారు.
