Italy : బానిసత్వం నుండి విముక్తి పొందిన 33 మంది భారతీయులు
ఇటలీలోని వెరోనా ప్రావిన్స్‌లో బానిసలుగా ఉన్న 33 మంది భారతీయ వ్యవసాయ కూలీలను పోలీసులు విడుదల చేశారు
ఇటలీలోని వెరోనా ప్రావిన్స్‌లో బానిసలుగా ఉన్న 33 మంది భారతీయ వ్యవసాయ కూలీలను పోలీసులు విడుదల చేశారు. భారతీయులను బానిసలుగా మార్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి సుమారు ఐదు లక్షల యూరోలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఇటలీలో కార్మికులపై వేధింపుల అంశం.. గత నెలలో మెషిన్‌లో కట్ అవడంతో భారతీయ కార్మికుడు మరణించడంతో వెలుగులోకి వచ్చింది.
భారతీయులను బానిసలుగా మార్చే ముఠా నాయకుడు కూడా భారతీయుడని పోలీసులు తెలిపారు. భారతీయులకు మంచి భవిష్యత్తు ఇస్తానని వాగ్దానం ఇచ్చి వారిని ఉచ్చులోకి నెట్టాడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి 17,000 యూరోలు అందజేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు సీజనల్ వర్క్ పర్మిట్‌లపై ఇటలీకి వచ్చారు. కాని భారతీయులు ఎటువంటి సెలవు దినాలు లేకుండా రోజుకు 10-12 గంటలు పొలాల్లో బానిసలుగా పనిచేశారు. ప్రతిఫలంగా వారు గంటకు నాలుగు యూరోలు మాత్రమే వేతనాలు పొందారు. వాస్తవానికి ఈ కూలీ డబ్బులు కూడా చెల్లించలేదు. ఎందుకంటే ఈ కూలీలు ముఠా చేతిలో అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. అప్పులన్నీ తీర్చే వరకు వేతనాలు అందవని వాపోయారు.
బాధితులకు భద్రత, ఉద్యోగ అవకాశాలు, చట్టపరమైన నివాస పత్రాలు అందజేస్తామని పోలీసులు తెలిపారు. ఇతర యూరోపియన్ దేశాల మాదిరిగానే ఇటలీలో కూడా కార్మికుల కొరత పెరుగుతుండటం గమనార్హం. వలసల ద్వారా కార్మికుల కొరత తీరుతుంది. ముఖ్యంగా తక్కువ జీతంతో పనిచేసే ఉద్యోగాల కోసం వలస వర్క్ వీసా వ్యవస్థ ఉంది. ఇందులో మోసాలకు పాల్పడిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.