Pakistan : రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి.. 145 మందికి గాయాలు
వాయువ్య పాకిస్థాన్‌లోని సమస్యాత్మక గిరిజన జిల్లాలో కొంత భూమిపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది.
వాయువ్య పాకిస్థాన్‌లోని సమస్యాత్మక గిరిజన జిల్లాలో కొంత భూమిపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. చాలా రోజులుగా ఈ పోరాటం సాగుతున్నప్పటికీ.. ఆదివారం హింసాత్మకంగా మారింది. ఇరువర్గాల మధ్య కాల్పుల్లో 30 మంది మరణించగా.. 145 మంది గాయపడినట్లు సమాచారం. పాకిస్తాన్ సైన్యం, స్థానిక నాయకులు రెండు గ్రూపుల మధ్య రాజీ కుదర్చడంలో నిమగ్నమై ఉన్నారు. సైన్యం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అయినా కూడా అక్కడ అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయి. రాకెట్ లాంచర్లతో దాడులు చేస్తున్నారు.
సమాచారం ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని కుర్రం జిల్లాలో గత ఐదు రోజులుగా జరిగిన గిరిజన ఘర్షణల్లో 30 మంది మరణించారు. 145 మంది గాయపడ్డారు. చాలా కాలంగా ఇక్కడ కొన్ని వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. గతంలో బోషెరా, మలికెల్, దండార్ ప్రాంతాలలో షియా, సున్నీ తెగల మధ్య వివాదం ఉంది. అయితే ఈ వివాదం పోలీసు, ఆర్మీ అధికారులు, వృద్ధ నాయకులు, జిల్లా యంత్రాంగం సహాయంతో సద్దుమణిగింది. అయితే భూ పంపిణీ విషయంలో మళ్లీ ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఇంకా ఈ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు, సైన్యం జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నాలుగు రోజుల క్రితం భూ వివాదంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలు పెవార్, తంగి, బలిష్‌ఖేల్, ఖర్ కలాయ్, మక్బాల్, కుంజ్ అలీజాయ్, పారా చమ్కాని, కర్మన్‌తో సహా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. కుర్రం గిరిజన జిల్లాలోని పరాచినార్, సద్దాలపై మోర్టార్, రాకెట్ షెల్స్‌తో కాల్పులు జరిపారు. గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం నాలుగు దాడులు జరిగాయి. ఇందులో చాలా మంది చనిపోయారు. ఈ దాడి దృష్ట్యా అన్ని పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు మూసివేశారు. ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు.