పురుషుల్లో(Male) ఉండే వై క్రోమోజోం(Y chromosomes) మగబిడ్డ జననానికి ప్రధాన కారణం.
పురుషుల్లో(Male) ఉండే వై క్రోమోజోం(Y chromosomes) మగబిడ్డ జననానికి ప్రధాన కారణం. దీనినే మేల్ క్రోమోజోం అని అంటారు. వై క్రోమోజోంకు సంబంధించిన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. మగ లింగాన్ని నిర్ణయించడానికి కీలకమైన Y క్రోమోజోమ్ క్రమంగా తగ్గిపోతుంది, చివరికి ఇది కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని ఈ అధ్యయనం తెలిపింది. దీనివల్ల ప్రపంచంలో ఆడపిల్లలే పుడతారు. క్షీణిస్తున్న Y క్రోమోజోమ్ ద్వారా పురుషులు తుడిచిపెట్టుకుపోతారా అన్న సందిగ్ధ పరిస్థితి నెలకొంది. మగవారిలో ఒక ఎక్స్ (X), ఒక వై (Y) ఉంటాయి. అదే ఆడవారిలో అయితే రెండు ఎక్స్ క్రోమోజోములు (XX) ఉంటాయి. ఈ వై క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్ కంటే చాలా చిన్నది. తాజా అధ్యయనం(Recearch) ప్రకారం పురుషుల్లో వై క్రోమోజోమ్ క్రమంగా మాయవుతోందని పరిశోధకులు తేల్చారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్‌లో అధ్యయన నివేదికను వెల్లడించారు.
వై క్రోమోజోమ్ సమయం తగ్గిపోతుందని, ఇది ఇలాగే కొనసాగితే, వై క్రోమోజోమ్ 11 మిలియన్ సంవత్సరాలలో పూర్తిగా అదృశ్యమవుతుంది, ఇది మగ సంతానం , మానవ మనుగడ గురించి భయాలను పెంచుతుందని ప్రముఖ జెనెటిక్స్ ప్రొఫెసర్ , శాస్త్రవేత్త జెన్నిఫర్ ఎ. మార్షల్ గ్రేవ్స్ తెలిపారు. 1.1 కోట్ల ఏళ్ల కాలంలో వై క్రోమోజోమ్ కనుమరుగైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవే లక్షణాలతో మరో మేల్ క్రోమోజోమ్ ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మార్షల్ గ్రేవ్స్ వెల్లడించిన అంశాల ప్రకారం గత కొన్ని లక్షల సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. వాస్తవానికి ‘Y’ క్రోమోజోములో 1438 జన్యువులుంటాయి. కానీ, గత 300 మిలియన్ సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువుల సంఖ్య భారీగా పడిపోయింది. ఇప్పటికే 1438 జన్యువుల్లో 1393 జీన్స్ మాయమైపోయాయని ప్రస్తుతం 45 జన్యువులు మాత్రమే ఉన్నాయి. అంటే మరో 11 మిలియన్ల సంవత్సరాల్లో ఆ మిగిలిన 45 జన్యువులు కూడా అంతర్ధానమయ్యే అవకాశం ఉంది.