ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్(Phantom vibration syndrome) భారిన ప‌డిన‌ వ్యక్తి..

ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్(Phantom vibration syndrome) భారిన ప‌డిన‌ వ్యక్తి.. ఏ ఫోన్‌, మెసేజ్ రాక‌పోయినా..తన ఫోన్, గాడ్జెట్ వైబ్రేట్ అవుతున్నట్లు ఫీల‌వుతాడు. ఫోన్‌లు(Phones) లేదా ఇతర గాడ్జెట్‌లను(Gadjets) ఎక్కువగా ఉపయోగించేవారిలో ఈ సిండ్రోమ్ తరచుగా సంభవిస్తుంది. ఈ పరిస్థితిని "సిండ్రోమ్" అని పిలిచినప్పటికీ.. ఇది వైద్యపరమైన వ్యాధి కాదు. ఇది చాలా మందికి ఉన్న గందరగోళ భావన. మొబైల్ ఫోన్‌లను అతిగా వాడేవారిలో 89% మంది ఏదో ఒక సమయంలో ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. దీనికి సంబంధించి వైద్యులు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. అవి తెలుసుకుందాం.

ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అనేక కారణాల వల్ల సంభవించవచ్చు, వాటిలో కొన్ని క్రింది విధంగా ఉన్నాయి..

1. ఫోన్ నుండి వచ్చే నోటిఫికేషన్‌లు, వైబ్రేషన్‌లకు మన మెదడు అలవాటుపడుతుంది. మెదడు వాటిని ఆశించడం నేర్చుకుంటుంది. కొన్నిసార్లు ఇతర శ‌బ్ధాల‌కు కూడా ఫోన్ నోటిఫికేషన్, మెసేజ్‌, కాల్‌ వ‌చ్చిందేమోన‌ని రియాక్ట్ అవుతాం కదా.. అలాగ‌న్న మాట‌..!

2. నిత్యం ఆన్‌లైన్‌లో ఉండటం ఓ వ్యసనం. ఈ వ్యసనం కూడా ఒక ఆందోళనగా మారుతుంది. మన భావాలను వైబ్రేషన్‌ల వైపు సెట్ చేస్తుంది. మనం ముఖ్యమైన కాల్ లేదా మెసేజ్‌ కోసం ఎదురు చూస్తున్నప్పుడు.. ఇటువంటి భావ‌న‌ను ఎదుర్కొంటాం.

ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ నుండి ఎటువంటి హాని లేదు.. కానీ ఇది చాలా సమస్యలను కలిగిస్తుంది. మీరు తరచుగా వైబ్రేషన్ వ‌చ్చింద‌నే భావ‌న‌లో ఉన్నట్లయితే.. మీరు ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు స్పష్టం అయిన‌ట్లే. ఇది ఒత్తిడి, ఆందోళనకు కారణం అవుతుంది. ఫోన్ వ్యసనం భౌతికంగా కూడా హానికరం. రోజంతా కూర్చొని ఫోన్ ఉపయోగించడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్‌ను ఎలా నియంత్రించాలి.?

1. ఫోన్‌కు పూర్తిగా దూరంగా ఉండటం సాధ్యం కాదు. కానీ తక్కువ వాడ‌టం ఖచ్చితంగా సాధ్యమే. మెసేజ్‌లు-అల‌ర్ట్స్‌ను తనిఖీ చేయడానికి సమయాన్ని సెట్ చేసుకోండి. దీంతో రోజంతా ఫోన్‌లోనే మునిగే అలవాటు క్రమంగా తగ్గుతుంది.

2. పని అయిపోయాక‌ ఫోన్‌ను వైబ్రేషన్ లేదా సైలెంట్ మోడ్‌లో ఉంచండి. మీ ఫోన్‌లో వాడాల‌నుకున్న యాప్‌ల‌లో నోటిఫికేషన్‌లను సెట్ చేయండి. ఫోన్‌ని కాసేపు ప‌క్క‌కు పెట్టి.. పుస్తకాలు చదవడం, నడకకు వెళ్లడం లేదా స్నేహితులను కలవడం వంటి పనులు చేయండి.

3. మనస్సును రిలాక్స్ చేయడానికి ధ్యానం చేయండి. ధ్యానం ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలను దూరం చేయడమే కాకుండా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వీలైతే.. మీ ఫోన్‌ను మీ జేబులో కాకుండా బ్యాగ్ లేదా డెస్క్‌లో ఉంచండి. దీంతో ఫోన్ వైబ్రేషన్, నోటిఫికేషన్‌లకు సంబంధించి ఎలాంటి గందరగోళం ఉండదు.

ఫోన్ వ్యసనం, ఈ సిండ్రోమ్ కారణంగా మీ రోజువారీ జీవితం ప్రభావితమైతే.. వెంట‌నే వైద్యుడిని సంప్రదించండి. వైద్యులు ఈ లక్షణాల ఆధారంగా చికిత్స లేదా ఏవైనా సాధ్యమయ్యే విషయాలను సూచించగలరు. డాక్ట‌రైతే వీలైనంత త్వరగా ఈ సమస్యను నయం చేయడంలో సహాయపడగలరు.

ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది.. ఫోన్‌ను ఎలా ఉపయోగించాలి అనే విషయాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ లక్షణాలను సులభంగా తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన జీవ‌నం కోసం ఫోన్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి.

Eha Tv

Eha Tv

Next Story