జెర్రికి(centipedes) వందకాళ్లు ఉంటాయో లేదో తెలియదు కానీ శతపది అని పిల్చుకుంటారు. ఇంగ్లీషులోనూ సెంటిపెడ్ అంటారు.
జెర్రికి(centipedes) వందకాళ్లు ఉంటాయో లేదో తెలియదు కానీ శతపది అని పిల్చుకుంటారు. ఇంగ్లీషులోనూ సెంటిపెడ్ అంటారు. అంటే వంద కాళ్లు(100 Legs) కలది అని అర్థం. బాత్‌రూమ్‌లలో అప్పుడప్పుడు కనిపించే జెర్రిలను చూసి మనమేమీ భయపడం కానీ, అప్రయత్నంగానే చంపేస్తాం! జెర్రీ కాటు మహా డేంజర్ అని పెద్దలు చెబుతారు. అసలు ఆ పురుగులో ఉన్న విష ప్రభావం ఎంత అనే దానిపై సీసీఎంబీ(CCMB) అంచనా వేస్తున్నది. అరుదైన జీవావరణం విస్తరిం చి ఉన్న పశ్చిమ కనుమల్లో పరిశోధనలు సాగిస్తున్న సీసీఎంబీ ఈ తరహా పురుగు పుట్రల సంరక్షణకు తీసుకోవల్సిన చర్యలపై అధ్యయనం చేస్తోంది. శతపాది జాతులకు చెందిన పురుగుల్లో న్యూరోటాక్సిక్(neurotoxic), సైటో టాక్సిక్(Sytotoxic) ప్రొటీన్లు, పప్టైడ్‌ల కాక్‌టెయిల్ ఉంటాయంటున్నారు సీసీఎంబీ పరిశోధకులు. మన పెద్దలు చెప్పినట్టుగానే జెర్రి కాటు వేస్తే చలి, జ్వరం, వాపు, చర్మ సమస్యలు, ఎలర్జీ, రక్తస్రావం, తీవ్రమైన నొప్పి, అలసట కలుగుతాయని పరిశోధకులు అంటున్నారు. మరణాలు కూడా సంభవిస్తాయట! క్రీస్తుపూర్వం మన చరకుడు రాసిన చరక సంహితలో కూడా శతపాది విష గుణాల గురించి వివరంగా ఉంది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కూడా ఇందుకు సంబంధించిన వైద్య విధానం ఉంది. జెర్రి విషంలో కణతులు, దగ్గు, గజ్జి, గుండె సంబంధిత వ్యాధులను కట్టడి చేసేందుకు అవసరమైన రసాయనిక మిశ్రమాలు ఉన్నాయంటున్నారు. అయితే దాని విష ప్రభావం ఎంత స్థాయిలో ఉందనేదానిపైనే అధ్యయనం చేస్తున్నారు.