ఇప్పుడు పిల్లలను పెంచి పెద్ద చేయడం కష్టంతో కూడుకున్న పని! పసిపిల్లల సంరక్షణ తల్లిదండ్రుల బాధ్యతే అయినప్పటికీ నేటి తరం పేరంట్స్ (అందరూ కాదు) దాన్ని ఓ బరువుగా భావిస్తున్నారు.
ఇప్పుడు పిల్లలను పెంచి పెద్ద చేయడం కష్టంతో కూడుకున్న పని! పసిపిల్లల సంరక్షణ తల్లిదండ్రుల బాధ్యతే అయినప్పటికీ నేటి తరం పేరంట్స్ (అందరూ కాదు) దాన్ని ఓ బరువుగా భావిస్తున్నారు. వెనుకటి తరం అలా కాదు. తల్లి అయిన మరుక్షణమే శిశువును ఎలా సంరక్షించుకోవాలో మాతృమూర్తులకు తెలిసిపోయేది. బిడ్డ ఏడుపును బట్టి ఆకలితో ఏడుస్తున్నదా? నొప్పితో ఏడుస్తున్నాదా? చెప్పేసేవాళ్లు. పిల్లల కాలకృత్యాల విషయంలోనూ అవగాహన ఉండేది. వాడేసిన కాటన్ దుస్తులతో గోచీలు తయారు చేసి బిడ్డకు కట్టేవారు. ఇప్పుడేమో డైపర్లు(Daipers) వచ్చేశాయి. పాపం పొద్దస్తమానం బిడ్డకు డైపర్లు అతికిస్తున్నారు. దీనివల్ల పనిభారం తగ్గిందని తల్లులు అనుకోవచ్చు కానీ, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పిల్లలకు లేని పోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. యూస్ అండ్ త్రో డైపర్ల(Use and throw Daipers) వల్ల అనేక సమస్యలు ఉన్నాయంటున్నారు. వీటివల్ల పర్యావరణానికి(environment) కూడా ముప్పు వాటిల్లుతున్నదట! అందుకే బట్టతో చేసిన డైపర్లను(cloth daipers) ఎంచుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. వీటిని మిగతా దుస్తులతో కాకుండా సపరేట్‌గా ఉతకాలని, అది కూడా వేడినీళ్లతో ఉతికితే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. చాలా మంది తల్లులు తమ పిల్లలు మూత్రానికి వెళ్లిన తర్వాత డైపర్లను మార్చకుండా ఉంటారు. ఎలాగూ డ్రై అవుతుందన్నది వారి భావన కావచ్చు. కానీ ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం పిల్లలకు ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. డైపర్‌ను తొడిగే ముందు పిల్లల గజ్జల్లో టాల్కమ్ పౌడర్ వేస్తే మంచిది. అది కూడా డాక్టర్లు సిఫారసు చేసిన టాల్కం పౌడర్‌నే వాడాలి. చీప్‌గా వస్తున్నదని ఏది పడితే ఆ కంపెనీ డైపర్లు వాడకూడదని, నాలుగు పైసలు ఎక్కువైనా నాణ్యత కలిగిన డైపర్లను కొనడం శ్రేయస్కరమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పిల్లలకు డైపర్లు కట్టడం ఏ మాత్రం మంచిది కాదని, వారికి వదులుగా ఉండే గోచి కడితే హాయిగా ఉంటుందని చెబుతున్నారు. అన్నట్టు ఈ గోచీలను ప్రతి రోజూ వేడినీటితో ఉతకాలి. ఎండకు బాగా ఆరబెట్టాలి.