ఇతర ఇన్‍ఫ్లుయెంజా రకాలతో పోల్చుకుంటే ఈ H3N2 సబ్‍టైప్ కాస్త తీవ్రంగా వ్యాపిస్తోంది.

అంతు చిక్కని రోగాలతో ఇప్పటికే ఆందోళన చెందుతున్న ప్రజలకు మళ్లీ అలజడి మొదలైంది. కొత్తగా హెచ్‍3ఎన్2 ఇన్‍ప్లుయెంజామరో వైరస్ కలవరపెడుతోంది. దీని బారిన పడి ఇద్దరు ఇప్పటికే మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖకు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక, హర్యానాలో ఒక్కక్కరి చొప్పున మృతి చెందినట్టు తెలిపాయి . ఇంకా ఇప్పటికి దేశవ్యాప్తంగా H3N2కు సంబంధించిన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇతర ఇన్‍ఫ్లుయెంజా రకాలతో పోల్చుకుంటే ఈ H3N2 సబ్‍టైప్ కాస్త తీవ్రంగా వ్యాపిస్తోంది. దీని వల్లే దేశంలో జర్వం కేసులు నానాటికీ పెరుగుతున్నాయని కేంద్రం భావిస్తోంది. H3N2 ప్రాణాంతకం కాదన్న నిపుణులు ...... అయితే తప్పకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

అయితే H3N2 ఇన్‍ఫ్లుయెంజా సోకిన వారికి 3 నుంచి 5 రోజుల వరకు జ్వరం ఉంటుంది. అయితే దగ్గు మాత్రం మూడు నుంచి ఐదు వారాల వరకు కొనసాగే అవకాశం ఉంది. అంటే జ్వరం తగ్గినా దగ్గు మాత్రం ఉంటుంది. గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు ఉంటాయి. కొందరికి శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. H3N2 ఇన్‍ఫ్లుయెంజా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపరల ద్వారా ఎక్కువగా ఇది వ్యాపిస్తుంది. అలాగే తుంపరలు ఉన్న ప్రదేశాన్ని ఎవరైనా తాకి తమ ముక్కు, నోటిని చేతిలో ముట్టుకున్నా కానీ అలాంటి వారికి కూడా ఈ H3N2 ఇన్‍ఫ్లుయెంజా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్స్ . చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ సబ్బు, నీటితో కడుక్కుంటూ ఉండాలి.
జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముఖానికి మాస్కు తప్పని సరిగా ధరించాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపరలు బయటికి రాకుండా నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. నీటితో పాటు ఇతర ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ హైడ్రేటెడ్‍గా ఉండాలి. ముఖం, ముక్కును చేతులతో తాకకూడదు ..షేక్ హ్యాండ్స్ ఇవొద్దు. జలుబు , జ్వరం తో బాధపడేవారు బహిరంగ ప్రదేశాల్లో అసలు ఉమ్మకూడదు. అనారోగ్యంగా అనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్లను సంప్రదించాలి. యాంటి బయోటిక్స్ సొంతంగా వాడకూడదు. పల్స్ ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్ లెవెళ్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది. 95 శాతం కంటే ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ తక్కువగా ఉంటే వైద్యులను వెంటనే సంప్రదించాలి. ప్రతి సంవత్సరం ఈ సమయంలో ఇన్‍ఫ్లుయెంజా వైరస్‍లు వస్తాయని, అలాంటి వాటిలో ఒక రకమే H3N2 అని ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణ్‍దీప్ గులేరియా ఇటీవల అన్నారు. అయితే వైరస్ మ్యూటేట్ అయి మార్పులు చెందుతోందన్నారు . అది సాధారణ ఇన్‍ఫ్లుయెంజా రకమేనని, అయితే అందరూ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Updated On 10 March 2023 4:36 AM GMT
Ehatv

Ehatv

Next Story