ఆరోగ్యానికి అమూల్యమైన ప్రకృతివరం
హాలీవుడ్‌లో మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మధ్య ఎముకల పులుసు (Bones Soup) ఇటీవల ఎంతో ప్రాచుర్యం పొందింది. కోడి, మేకపోతు, బీఫ్, లేదా చేపల ఎముకలతో తయారుచేసే ఈ పులుసు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది నీటితో పాటు వివిధ రకాల కూరగాయలు, మూలికలతో గంటల తరబడి ఉడికించడం ద్వారా తయారవుతుంది.
బోన్ సూప్‌లో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు, కొల్లాజెన్ శరీరానికి అవసరమైన పుష్టిని అందిస్తాయి. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో మరియు కీళ్ల దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం కుంగిపోకుండా, ముడతలు రాకుండా చేస్తూ యవ్వన వదనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం, శరీరంలోని వాపును తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
ఎముకల పులుసులోని కొల్లాజెన్ చర్మ ఆరోగ్యానికి అమోఘంగా దోహదపడుతుంది. ఇది చర్మాన్ని ముడతలు రాకుండా కాపాడి, దాని సహజ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. పులుసులో జెలటిన్ పేగు ఆరోగ్యానికి మేలు చేస్తూ, జీర్ణవ్యవస్థ సమస్యలను తగ్గిస్తుంది.
గ్లూటామైన్ అనే అమైనో ఆమ్లం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పులుసులో ఉండే ప్రోటీన్ వ్యాయామం తర్వాత అలసిపోయిన కండరాలను పునరుద్ధరిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకల బలాన్ని పెంచుతాయి, ఎముకల వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
గ్లైసిన్ అనే అమైనో యాసిడ్ నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి, మంచి నిద్ర పొందడంలో సహాయపడుతుంది. పులుసులోని జెలటిన్ ఆకలిని అరికడుతుంది, కడుపు నిండుగా అనిపించడంలో సహాయపడుతుంది. పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు శరీరంలో హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడంలో సహాయపడతాయి.
అంతేకాకుండా, గ్లైసిన్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ మరియు ఆటో ఇమ్యూన్ రుగ్మతల వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయని పరిశోధనల ద్వారా తేలింది.