యమ ధర్మరాజును ఎదిరించి భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకున్న సావిత్రి(Savitri) కథ తెలుసుగా! ఆ మహాసాధ్వీ పేరిట ఓ వ్రతం ఉన్న సంగతి తెలుసా..? ఉత్తర భారతీయులు జరుపుకునే ఈ వ్రతం విశిష్టత ఏమిటో...? ఎందుకు జరుపుకుంటారో...?
యమ ధర్మరాజును ఎదిరించి భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకున్న సావిత్రి(Savitri) కథ తెలుసుగా! ఆ మహాసాధ్వీ పేరిట ఓ వ్రతం ఉన్న సంగతి తెలుసా..? ఉత్తర భారతీయులు జరుపుకునే ఈ వ్రతం విశిష్టత ఏమిటో...? ఎందుకు జరుపుకుంటారో...? ఇప్పుడు తెలుసుకుందాం! వట సావిత్రీ వ్రతం గురించి చాలామందికి తెలియకపోవచ్చుగానీ రేపు అంటే మే 19వ తేదీన ఉత్తర భారతీయులు దీన్ని నోచుకోబోతున్నారు. రేపు ఉదయం 04.06 గంటల నుంచి పూజా సమయం మొదలవుతుంది.
యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కి తెచ్చుకున్న సావిత్రిని స్మరించకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. భర్త సత్యవంతుడు చనిపోతే మర్రిచెట్టును(Banyan tree) భక్తితో సావిత్రి పూజించిందట! ఆ మహిమ కారణంగానే ఆమె యముడి వెంట నడవగలిగిందట! సావిత్రి ముందు యముడి ఆటలు సాగకపోవడానికి కారణం కూడా ఇదేనట! సావిత్రి ఆచరించిన వ్రతాన్నే ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల మహిళలు ఆచరిస్తారు. పెళ్లి అయిన యువతులంతా వట సావిత్రీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజున కొత్త బట్టలు వేసుకుంటారు. ఇరుగుపొరుగువారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రిచెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
మర్రి చెట్టును అంటే వట వృక్షాన్ని సిందూరంతో అలంకరిస్తారు. నూలు దారం పోగులను చెట్టు మొదలుకు చుడతారు. పూలు పెడతారు. గాజులు, పసుపుకుంకుమలను సమర్పించుకుంటారు. వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. వటవృక్షాన్ని త్రిమూర్తుల స్వరూపమని భావిస్తారు. ఆ చెట్టు వేళ్లు బ్రహ్మకు, కాండము విష్ణువుకు, కొమ్మలు పరమశివుడి నివాసస్థలాలట! మర్రిచెట్టులా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని మొక్కుకుంటారు. ఆ చెట్టు నీడలాగే తమ భర్తలు కూడా కుటుంబానికి నీడనివ్వాలని కోరుకుంటారు.
ధూపదీప నైవేద్యాలను సమర్పించుకుంటారు. ఆ శక్తిని ప్రసాదించవలసిందిగా సావిత్రిదేవిని వేడుకుంటారు. ఆ రోజున పిండివంటలు, తీపి పదార్ధాలు చేసుకుంటారు.. వ్రతానికి బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. వ్రతం రోజు రాత్రి చంద్రున్ని చూసేంతవరకు ఉపవాసం ఉంటారు. కొందరు ఒకపూట భోజనం చేస్తారు.. మరికొందరు పళ్లు ఫలహారాలు మాత్రమే తీసుకుంటారు. ఈ వ్రతం ఎప్పుడు ఆరంభమయ్యిందో.. ఎవరు ప్రారంభించారో తెలియదు కానీ.. అయిదు వందల ఏళ్లుగా వట సావిత్రీ వ్రతాన్ని ఆచరిస్తున్నారని తెలుస్తోంది..