మన దేశంలోని కొన్ని ఆలయాల గర్భగుడుల లోనికి కొందరిని రానిస్తున్నారు. ముఖ్యంగా జ్యోతిర్లింగాలను అందరూ స్పర్శించవచ్చు - అని కొందరంటారు.
మన దేశంలోని కొన్ని ఆలయాల గర్భగుడుల లోనికి కొందరిని రానిస్తున్నారు. ముఖ్యంగా జ్యోతిర్లింగాలను అందరూ స్పర్శించవచ్చు - అని కొందరంటారు.
కానీ కొన్ని ఆలయాలలో గర్భగుడిలోనికి వెళ్ళక పోవడం నియమం. అది శాస్త్రాలు ఏర్పరచినది. ఏ వర్ణంవారు కూడా గర్భగుడిలోనికి రారు. దానికంటూ నియమించిన అర్చకులు తప్ప. దీని వెనుక భౌతిక - ధార్మిక కారణాలున్నాయి.
మూర్తిని తాకాలన్నా, అర్చించాలన్నా సదాచారం, శాస్త్ర నియమాలు అవసరం. అవి అందరికీ సాధ్యం కావు.
“సదాచారం లేనివారు, రజస్వలయైన వారు గుడిలోకి ప్రవేశిస్తే విగ్రహం/లింగంలోని దైవశక్తి ఇంక ఉండదు. వెంటనే ప్రోక్షణాదులు జరపాలి. లేకపోతే క్రమంగా ఆ విగ్రహాదుల్లోకి పిశాచాలు ప్రవేశిస్తాయి.
ఆ గ్రామ, నగరాలలో ఉపద్రవాలు వస్తాయి. వ్యాధులతో , శోకాలతో ప్రేతాలు భయాన్ని కలిగిస్తాయి" - అని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది.
సంప్రోక్షణం ప్రకుర్వీత
తద్దోషస్యోపశాంతయే|
దోషైరుపహతం జ్ఞాత్వా
ప్రాసాద ప్రతి మాదికం|| (ఈశ్వర సంహిత)
విలంబనే తు నిష్కృత్యా
వినశ్యేద్దేవ సన్నిధిః|
తత్స్థాః ప్రేతా భయం కుర్యుః
వ్యాధి శోకాదిభిర్నృణామ్|| (విష్ణు సంహిత)
ఆలయంలోని విగ్రహంలో దేవుడున్నాడని విశ్వసిస్తే, వీటినీ విశ్వసించాలి. విగ్రహాన్ని దేవతా శక్తిగా మార్చడం ఒక మహా ప్రక్రియ. ప్రతిమాశోధన - అనేది మంత్ర, యజ్ఞాదులతో చేసి, యంత్రాది, ప్రతిష్టాది విధానాలతో ఆ బింబంలో కళాన్యాసం చేసి దేవతని ప్రతిష్ఠిస్తారు. వాటిని స్పర్శించా లన్నా, అర్చించాలన్నా ఆయా నియమాలను అనుష్టించే వారికే అర్హత ఉంటుంది.
అయితే దేవాలయంలోని మూర్తిని తాకవలసిన అవసరమేముంది? నమస్కరిస్తేచాలు - ఆ మూర్తినుండి శక్తి తరంగాలు ప్రసరిస్తాయి. ధ్యానిస్తే చాలు - తరించిపోతాం. అందుకే - గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం-వంటివి అంద రూ దర్శించి అనుగ్రహం పొందడానికై ఏర్పాటు చేశారు. యుగాలనుండి అందరూ ఆలయానికి వెళ్ళి స్వామి దయను పొందుతున్నారు.
భౌతికంగా ఆలోచించినా - గర్భాలయంలోకి జనం ఎక్కు వైనా, అందరూ తాకుతున్నా ప్రశాంతత దెబ్బతినడం, విగ్రహ శిల అరిగిపోవడం వంటివి జరుగుతాయి. కొద్దిమంది నియమితంగా సేవిస్తే- అవి పదిలంగా ఉంటాయి.
స్థూలంగా ఆలోచిస్తే అసమంజసంగా అనిపించేవి, సూక్ష్మం గా గమనిస్తే సముచితంగా అనిపిస్తాయి. ఆ సూక్ష్మదృష్టి, తెలివిలేని మూర్ఖులు మన మతాన్ని విపరీత దృష్టితో చూస్తున్నారు. వైద్యచికిత్సా కేంద్రాలలో శస్త్రచికిత్సవంటివి జరిగేచోట వైద్యుడు, రోగి తప్ప ఎవరూ ఉండరు. ఎందుకు? అది ఒక సూక్ష్మ విజ్ఞానం. అలాగే దేవతా వ్యవస్థది మరొక సూక్ష్మవిజ్ఞానమే. నమ్మితే ఈ విజ్ఞానాన్నీ నమ్మాలి.
సర్వవ్యాపకుడైన పరమేశ్వరునికి ఏ పరిమితులు, నియమాలు ఉండవు. ఎవరైనా, ఎక్కడైనా, ఎలాగైనా స్మరించి, ధ్యానించి, కీర్తించి ధన్యులు కావచ్చు. కానీ ఒక విగ్రహంగా దివ్యశక్తిని కేంద్రీకరించినప్పుడు మాత్రం నియమాలు వర్తిస్తాయి.