ప్రసిద్ధిగాంచిన పూరి క్షేత్రంలో జగన్నాథస్వామి(Puri jagannadh temple) బలభద్రుడు, సుభద్రాదేవిలతో కొలువుతీరి ఉంటాడని తెలుసు
ప్రసిద్ధిగాంచిన పూరి క్షేత్రంలో జగన్నాథస్వామి(Puri jagannadh temple) బలభద్రుడు, సుభద్రాదేవిలతో కొలువుతీరి ఉంటాడని తెలుసు. ఈ క్షేత్రంలో జగన్నాథుడిని, బలభద్రుడిని ఏకదంతుడి రూపంలో ముస్తాబు చేసి పూజలు చేస్తారు. ఈ వేడుకను హాథీబేష అంటారు. అంటే ఏనుగు వేషమన్నమాట! ప్రతి ఏడాది ఆషాఢమాసంలో జగన్నాథుడిని వినాయకుడి రూపంలో ముస్తాబు చేసి పూజ చేస్తారు. ఈ వేడుక జేష్ట పౌర్ణమి రోజున జరగుతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే.. దానికో ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం పూరిని పాలిస్తున్న రాజు దగ్గరకు గణపతి బప్ప(Ganapati Bappa) అనే పండితుడు వచ్చాడు. ఈయన వినాయకుడికి భక్తుడు. ఆ పండితుడు వచ్చిన సమయంలో పూరిలో జగన్నాథుడిని స్నాన యాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు. ఆ ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా గణపతి బప్పను రాజు ఆహ్వానిస్తాడు. అందుకు ఆయన తాను గణపతిని మాత్రమే పూజిస్తానని అంచేత వేడుకకు రాలేనని చెబుతాడు. అయినా రాజు ఒత్తడి చేస్తాడు. దాంతో అయిష్టంగానే జగన్నాథుడి స్నాన యాత్రకు హాజరవుతాడు గణపతి బప్ప. చిత్రంగా ఆ జగన్నాథ స్వామి గణపతిబప్ప కంటికి ఏకదంతుడి రూపంలో కనిపిస్తాడు. అది జగన్నాథుడి లీల అని తెలుసుకోలేని గణపతి బప్ప ఆశ్చర్యపోతాడు. కలనో, మాయనో తెలియక అయోమయం చెందుతాడు. విచిత్రంగా బలభద్రుడు కూడా ఏకదంతుడి రూపంలోనే కనిపిస్తాడు. అప్పుడు గణపతిబప్పకు జ్ఞానోదయం కలుగుతుంది. తన అజ్ఞానానికి విలపిస్తాడు. తనకు బుద్ధి చెప్పడానికే ఆ కృష్ణ భగవానుడు ఇలా చేశాడని తెలుసుకుంటాడు.
అప్పటి నుంచి పూరి జనన్నాథుని రథయాత్రకు ముందు అంటే జేష్ట పౌర్ణమి రోజు జరిపే స్నాన యాత్ర సమయంలో ఆలయ పూజరులు జగన్నాథ, బలభద్రుల ముఖాలకు ఏనుగు తొడుగులు తొడుగుతారు.బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో, జగన్నాథుడు నల్ల ఏనుగు రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇలా పూరీ జగన్నాథుని ఏకదంతుడి రూపంలో ధరిస్తే తమకు మంచి జరగుతుందని భక్తుల విశ్వాసం.