భాద్రపద మాసంలో(Bhadrapada masam) వచ్చే శుద్ధ చతుర్దశిని అనంత పద్మనాభ చతుర్దశి(Anantha padmanabha swamy chaturthi) అంటారు.
భాద్రపద మాసంలో(Bhadrapada masam) వచ్చే శుద్ధ చతుర్దశిని అనంత పద్మనాభ చతుర్దశి(Anantha padmanabha swamy chaturthi) అంటారు. అందుకే అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశి రోజున ఆచరించాలి. ఈ రోజు పాలకడలిలో శేషతల్పసాయిపై మహాలక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును పూజించడం ఆనవాయితి! అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది.
ధర్మరాజు, అనంతుడంటే ఎవరు అని శ్రీ కృష్ణుడిని అడుగుతాడు. దీనికి కృష్ణుడు, 'ఆ పరమాత్మ అనంతపద్మనాభుడు అంటే ఎవరో కాదు నేనే, నేనే కాల స్వరూపుడిగా అంతటా వ్యాపించి ఉంటాను' అని చెప్పాడు. రాక్షసులను సంహరించడానికి తానే కృష్ణుడిలా అవతరించినట్లు, సృష్టి, స్థితి, లయలకు కారణమైన కాల స్వరూపుని రూపంలో ఉన్న పద్మనాభ స్వామి కూడా తానే అని, మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలు కూడా తనవే అని చెబుతాడు.
వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకొంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు.